ఐపీఎల్ 2022 సీజన్లో వరుస ఓటములతో ఇప్పటికే ప్లేఆఫ్ రేసు నుంచి అనధికారికంగా నిష్క్రమించిన ముంబయి ఇండియన్స్, పరువు కాపాడుకునే ప్రయత్నం చేస్తోంది. ఇప్పటికే 8 మ్యాచ్లాడేసిన ఆ జట్టు, అన్నింటిలోనూ ఓడిపోయి పాయింట్ల పట్టికలో చిట్టచివరి స్థానంలో కొనసాగుతోంది. ఆ జట్టు ఇక మిగిలిన ఆరు మ్యాచ్ల్లోనూ గెలిచినా, -1.00 నెట్ రన్రేట్ దృష్ట్యా ప్లేఆఫ్కి చేరడం అసాధ్యం. దాంతో ఇప్పటికే ప్లేఆఫ్ ఆశలు వదిలేసిన ఆ టీమ్, కనీసం చివరి ఆరు మ్యాచ్ల్లోనైనా మెరుగైన ప్రదర్శనతో పరువు నిలుపుకోవాలని ఆశిస్తోంది.
ఈ నేపథ్యంలో టఫ్ టీమ్ రాజస్థాన్ రాయల్స్ తో తలపడబోతుంది. హ్యాట్రిక్ విజయాలతో మొత్తంగా 12 పాయింట్లు సాధించి పాయింట్ల పట్టికలో రెండో స్థానాన్ని కైవసం చేసుకుని జోరుమీదున్న రాజస్థాన్, పేలవ ఫాంలో ఉన్న ముంబైను మట్టికరిపించేందుకు సిద్దమైంది. ఇప్పటికే ముంబైను ఓసారి చిత్తు చేసిన శాంసన్ టీమ్, మరోసారి రోహిత్ టీమ్ ను రఫ్పాడించాలని చూస్తోంది.
సంజూ టీమ్ ఈ ఐపీఎల్ లో మాత్రం టఫ్ ఫైట్ ఇస్తోంది. ఆ జట్టు హ్యాట్రిక్ విజయాలు సాధించి ఫ్లేఆఫ్ వైపు వేగంగా దూసుకుపోతుంది. ఈ మ్యాచ్లో ఓపెనర్లుగా బట్లర్ , దేవదత్ పడిక్కల్ బరిలోకి దిగుతారు. ఆ తర్వాత మిడిలార్డర్ లో డార్లీ మిచెల్, కెప్టెన్ సంజూ శాంసన్, హిట్ మేయర్ ఆడతారు. లోయర్ ఆర్డర్ లో రియాన్ పరాగ్ , ఆర్. అశ్విన్, ట్రెంట్ బౌల్ట్ రావచ్చు. బౌలింగ్ లో ప్రసిద్దకృష్ణ, స్టార్ స్పిన్నర్ చాహల్, కుల్దీప్ సేన్ ఆడటం పక్కా.
ఐపీఎల్ 2022 సీజన్ లో ముంబై ఇండియన్స్కు కలిసి రావట్లేదు. అన్నీ అపజయాలే. ఏ ఒక్క మ్యాచ్లోనూ గెలవలేదు. ఐదు సార్లు ఛాంపియన్ అయిన టీమ్, బోణి కొట్టేందుకు తంటాలు పడుతోంది. ఈ నేపథ్యంలో రాజస్థాన్ రాయల్స్ తో మ్యాచ్లో అయినా ఖాతా ఓపెన్ చేయాలని చూస్తోంది. ఈ మ్యాచ్లో ఓపెనర్లుగా విఫలమవుతున్న రోహిత్, ఇషాన్ కిషనే రానున్నారు. మిడిలార్డర్ లో డివాల్డ్ బ్రేవిస్, తిలక్ వర్మ, సూర్యకుమార్ ఆడతారు. లోయర్ ఆర్డర్ లో పోలార్డ్, హృతిక్ షూకెన్, డానియల్ సామ్స్ తుది జట్టులో ఉంటారు.
ఇక బౌలింగ్లో బుమ్రా, రిలే మెరిడిత్ ఆడటం ఖాయం. అయితే గత మ్యాచుల్లో విఫలమైన ఉనద్కట్ స్థానంలో ధవల్ కులకర్ణి ఈ మ్యాచ్ లో ఆడేది ఖాయంగా కనిపిస్తోంది. కెప్టెన్ రోహిత్ పట్టుబట్టి అతన్ని జట్టులోకి తీసుకున్నాడు.
ఇప్పటి వరకు ఇరు జట్ల మధ్య 26 మ్యాచులు జరిగితే అందులో ముంబై 13, రాజస్థాన్ 12 మ్యాచుల్లో గెలిచాయి, ఒక మ్యాచ్ రద్దయింది. ఈ సీజన్లో ఇరు జట్ల మధ్య ఒక మ్యాచ్ జరిగితే అందులో రాజస్థానే గెలవడం గమనార్హం.
ఈ మ్యాచ్ రాత్రి 7 గంటల 30 నిమిషాలకు ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో స్టార్ట్ కానుంది. పిచ్ విషయానికి వస్తే, డివై పాటిల్ స్టేడియం పిచ్ బ్యాటింగ్ కు అనుకూలిస్తుంది. అలాగే స్పిన్ కు సహకరిస్తుంది. పాటిల్ గ్రౌండ్ చిన్న గ్రౌండ్ కాబట్టి పింఛ్ హిట్టర్లు చెలరేగి ఆడొచ్చు. ఇక్కడ 12 మ్యాచులు ఆడితే ఆరు సార్లు రెండో సారి బ్యాటింగ్ చేసిన జట్టు, మరో ఆరు సార్లు మొదట బ్యాటింగ్ చేసిన టీమ్ గెలిచింది. ఈ నేపథ్యంలో టాస్ ప్రభావం అంతగా ఉండకపోవచ్చు. ఒక వేళ రాజస్థాన్ మొదట బ్యాటింగ్ చేస్తే 180 పరుగుల కంటే ఎక్కువ స్కోరు చేయాల్సి ఉంటుంది. అటు ముంబై మొదట బ్యాటింగ్ చేయాల్సి వస్తే 200 వరకు పరుగులు సాధిస్తేనే మ్యాచ్ ను కాపాడుకోవచ్చు. మరి ఈ మ్యాచ్లో అయినా ముంబై గెలిచి ఖాతా తెరుస్తుందా లేక మరోసారి రాజస్థాన్ కు తలొగ్గుతుందా చూడాలి.