జాతీయ లోక్ అదాలత్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని సీనియర్ సివిల్ జడ్జి జి. రాజేశ్వరి తెలిపారు. స్థానిక న్యాయస్థానంలో జరిగిన సమావేశంలో న్యాయమూర్తి పోలీసు శాఖ అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. జూన్ 26న జరగనున్న జాతీయ లోక్ అదాలత్ లో ఎక్కువ కేసులు పరిష్కారం అయ్యేవిధంగా ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. పోలీస్ అధికారులు తమ స్టేషన్ల పరిధిలోని కాంపౌండబుల్, క్రిమినల్ కేసుల్లో కక్షిదారులు రాజీకి వచ్చే విధంగా చూడాలని చెప్పారు.
కక్షిదారులను పిలిపించి వారికి సంబంధించిన వివరాలు తెలుసుకుని, వారిని రాజీ చేసు కునేలా ప్రోత్సహించాలని అన్నారు. రాజీ మార్గం రాజ మార్గమన్న విషయాన్ని వారికి చెప్పాలన్నారు. తద్వారా కక్షిదారుల సమయం, డబ్బు ఆదా అవుతుందన్న విషయం కూడా తెలియజేయాలన్నారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అదనపు జూనియర్ సివిల్ జడ్జి సాకే జ్యోతి, అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ శారద, పీలేరు అర్బన్ సిఐ మోహన్ రెడ్డి, రూరల్ సిఐ తులసీ కృష్ణ, ఇతర స్టేషన్ ఆఫీసర్లు, కోర్టు కానిస్టేబుళ్లు పాల్గొన్నారు.