భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి నోబెల్ బహుమతి ఇవ్వాలని బోంబే స్టాక్ ఎక్స్‌ఛేంజ్ చీఫ్ ఆశిష్ కుమార్ చౌహాన్ కోరారు. ఈ మేరకు శనివారం మీడియాతో మాట్లాడుతూ వైవిధ్యమైన ప్రతిపాదన చేశారు. కోవిడ్ మహమ్మారి వేళ పేదలకు ప్రధాని మోడీ అండగా నిలబడ్డారన్నారు.
ఉచిత ఆహార పథకం ద్వారా బియ్యం, గోధుమలు ఉచితంగా అందజేసి పేదల ఆకలి తీర్చారని ప్రశంసించారు. కోట్లాది మందికి ఉచిత ఆహార పథకాన్ని విజయవంతంగా అమలు చేశారని, ఇది ప్రపంచంలోనే అరుదైనదని కొనియాడారు. ప్రధాని మోడీ 80 కోట్ల మందికి ఉచిత ఆహార పథకం అమలు చేస్తే, ఐక్య రాజ్యసమితి ప్రపంచ వ్యాప్తంగా కేవలం 11.5 కోట్ల మందికే ఉచిత ఆహారం అందజేశారని గుర్తు చేశారు. మోడీ పిలుపుతో సామాజిక కార్యకర్తలు, ఫ్రంట్ లైన్ వారియర్లు అద్భుతంగా పని చేసి, కోవిడ్ కట్టడికి సేవలు అందించారన్నారు. కోట్లాది మంది కడుపు నింపిన ప్రధానికి నోబెల్ బహుమతి ఇవ్వడం సముచితమని అభిప్రాయపడ్డారు.