శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం గుడ్ న్యూస్ అందించింది. నడకదారిలో శ్రీవారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులను మే 5 నుంచి అనుమతించనున్నట్లు వెల్లడించింది. అంతేకాకుండా శనివారం తిరుమలలో నిర్వహించిన పాలక మండలి సమావేశంలో పలు కీలక నిర్ణయాలను తీసుకున్నారు. వాటి వివరాలను టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మీడియాకు వెల్లడించారు.
టైమ్ స్లాట్ దర్శనాల విషయంలోనూ, టోకెన్ల జారీపైనా నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. వాటిని కొనసాగిస్తామన్నారు. నడక దారి నుంచి వచ్చే భక్తులకు టోకెన్లు ఇవ్వనున్నట్లు చెప్పారు. తిరుమలలో కాలుష్య రహిత చర్యలు చేపట్టినట్లు వివరించారు. ఇందులో భాగంగా తిరుమల బాలాజీ నగర్ వద్ద ఎలక్ట్రిక్ బస్ స్టేషన్‌ను 2.86 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. శ్రీనివాస సేతు పనులకు రూ.100 కోట్లు, టీటీడీ ఉద్యోగులు ఉండే వసతి గృహాలను ఆధునీకరించేందుకు రూ.19.40 కోట్లు మంజూరు చేసినట్లు వివరించారు. ఇప్పటి వరకు నగదు రూపంలో విరాళాలు ఇచ్చే భక్తులకు కల్పించినట్లే, వస్తు రూపంలో విరాళాలు ఇచ్చే భక్తుల కోసం కూడా ప్రత్యేక సౌకర్యాలు కల్పిస్తామని చెప్పారు.