శాంతి చర్చలకు రావాలని చత్తీస్‌ఘడ్ ప్రభుత్వం ఇచ్చిన పిలుపునకు మావోయిస్టు పార్టీ సానుకూలంగా స్పందించింది. అయితే అందుకు ఓ కండిషన్ పెట్టింది. జైలులో మగ్గుతున్న తమ నేతలను విడుదల చేయాలని, దండకారణ్యంలో బలగాలను ఉపసంహరించుకోవాలని కోరింది. అంతేకాకుండా మరికొన్ని షరతులను పెట్టింది. జైలులో ఉన్న నేతలే వస్తారని, గతంలో లాగా అడవుల నుంచి మావోయిస్టు పార్టీ నేతలు రారని తెలిపింది. మావోయిస్టులు రాజ్యాంగం పట్ల విశ్వాసం వ్యక్తం చేస్తే వారితో చర్చలు జరిపేందుకు సిద్ధం అని నెల రోజు క్రితం చత్తీస్‌ఘడ్ సీఎం భూపేష్ భగల్ ప్రకటించారు. దానికి స్పందనగా తాజాగా మావోయిస్టుల నుంచి తాజాగా ప్రకటన వెలువడింది. సీఎం మాటలు నమ్మదగినవిగా లేవని, ఓవైపు శాంతి చర్చలంటూనే మరోవైపు వైమానిక దాడులు చేస్తున్నారని మావోయిస్టులు విమర్శించారు.
తమపై వైమానిక దాడులు చేయాలని ఆదేశాలు ఇచ్చింది ఎవరో తెలపాలని ముఖ్యమంత్రి మావోయిస్టు పార్టీ కోరింది. శాంతి చర్చలకు తాము సమ్మతమేనని, అందుకు తమ షరతులను ప్రభుత్వం అంగీకరించాలని సూచించింది. దీంతో ఇరు పక్షాల మధ్య త్వరలో శాంతి చర్చలు జరగనున్నట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.