ఆంధ్రపదేశ్, ఒడిశా రాష్ట్రాలను 'అసాని' తుపాను వణికిస్తోంది. నైరుతి బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న అండమాన్ సముద్రంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం ఆదివారం ఉదయం ఆసాని తుపానుగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది. సాయంత్రం తర్వాత వాతావరణ వ్యవస్థ తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉందని హెచ్చరించింది. అసని తుపాను ఒడిశా లేదా ఆంధ్రప్రదేశ్‌లో తీరాన్ని తాకదని, అయితే తీరానికి సమాంతరంగా కదులుతుందని తెలిపింది. పూరీకి ఆగ్నేయంగా దాదాపు 1,300 కిలోమీటర్ల దూరంలో అల్పపీడనం ఏర్పడిందని వివరించింది. వాయువ్య దిశగా కదులుతూ వాయుగుండంగా మారిందని, ఆదివారం ఉదయానికి తుపానుగా మారుతుందని పేర్కొంది. ఈ వాయుగుండం పోర్ట్ బ్లెయిర్‌కి నైరుతి దిశలో 290 కి.మీ దూరంలో, విశాఖపట్నంకు 1140 కిమీ ఆగ్నేయంగా కేంద్రీకృతమై ఉందని తెలిపింది.
ఉత్తర ఆంధ్ర-ఒడిశా తీరానికి చేరువైన తర్వాత తీవ్ర అల్పపీడనం తిరిగి వాయువ్య బంగాళాఖాతం వైపు కదులుతుందని ఐఎండీ డీజీ మృత్యుంజయ్ మహపాత్ర తెలిపారు. అసాని తుపాన్ కారణంగా కోస్తా ప్రాంతంలో బలమైన గాలులు వీస్తున్నాయి. దీంతో మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు సూచించారు. తీర ప్రాంతంలోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. ఏపీ, ఒడిశాలలో ఇప్పటికే విపత్తు నిర్వహణ బృందాలు అప్రమత్తమయ్యాయి. పరిస్థితులను అంచనా వేస్తున్నాయి.