బలమైన సైనిక సామర్థ్యం ఉన్న రష్యాతో ఉక్రెయిన్ తీవ్రంగా పోరాడుతోంది. ఓ వైపు రష్యా దాడులను అడ్డుకుంటూనే బలంగా ప్రతిఘటిస్తోంది. తాజాగా రష్యాకు చెందిన యుద్ధ నౌకను ఉక్రెయిన్ డ్రోన్ తునాతునకలు చేసింది. నల్ల సముద్రంలోని స్నేక్ ఐలాండ్ సమీపంలో రష్యాకు చెందిన మరో నౌకను ధ్వంసం చేసినట్లు ఉక్రెయిన్ వెల్లడించింది. ఒక సాయుధ డ్రోన్ రష్యా నియంత్రణలో ఉన్న చిన్న ద్వీపంలో సెర్నా ప్రాజెక్ట్ ల్యాండింగ్ క్రాఫ్ట్, క్షిపణి రక్షణ వ్యవస్థను ధ్వంసం చేసింది. దీనికి సంబంధించిన వీడియోను ఉక్రెయిన్ సాయుధ దళాలు ఆదివారం విడుదల చేశాయి. ఉక్రేనియన్ డ్రోన్, బైరక్టార్ TB2 నుండి ప్రయోగించిన క్షిపణి రష్యా యుద్ధనౌకను నాశనం చేసింది.
రష్యా యొక్క అత్యంత ముఖ్యమైన, శక్తివంతమైన యుద్ధనౌకలలో ఒకటిని గత నెలలో ఉక్రెయిన్ ధ్వంసం చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం పశ్చిమ దేశాలు అందించిన యుద్ధ సామగ్రి సహాయంతో రష్యాపై ప్రతిదాడులకు ఉక్రెయిన్ దిగుతోంది. ఈ క్రమంలోనే తాజాగా మరో యుద్ధ నౌకను తుత్తునియలు చేసింది. ఇదిలా ఉండగా ఆది, సోమ వారాల్లో ఉక్రెయిన్‌పై రష్యా భారీ దాడులకు దిగే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మే 9న రష్యాకు చాలా ప్రత్యేకమైన రోజు. రెండవ ప్రపంచ యుద్ధంలో జర్మన్ నాజీ సైన్యాలపై రష్యా ఆరోజున విజయం సాధించింది. 1945, మే 9న జర్మన్ సైన్యాలు రష్యాకు లొంగిపోయాయి. ఆ రోజును పురస్కరించుకుని ఉక్రెయిన్‌పై విజయం సాధించేందుకు రష్యా భారీగా రిజర్వ్ దళాలను దింపే అవకాశం ఉందని పశ్చిమ దేశాల నిఘా సంస్థలు అంచనా వేస్తున్నాయి.