టెస్లా అధినేత తరచూ చేసే ట్వీట్లు సంచలనంగా మారుతుంటాయి. తనదైన ట్వీట్లతో వార్తల్లో నానుతూ ఉంటుంటారాయన. ఉక్రెయిన్ మద్దతుగా పని చేయడం, అకస్మాత్తుగా ట్విట్టర్‌ను కొనుగోలు చేయడం, త్వరలో కోకాకోలా హస్తగతం చేసుకుంటానని చెప్పడం ఈ కోవలోకే వస్తాయి. తాజాగా తన మరణంపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. తాను ఒక వేళ అనుమానాస్పద స్థితిలో చనిపోవచ్చని ట్వీట్‌లో పేర్కొన్నారు. అయితే మీ అందరితో పరిచయం అయినందుకు సంతోషం అంటూ అని ట్విటర్‌లో ఆశ్చర్యకరరీతిలో పోస్ట్ చేశారు. దీనికి గంట ముందు ఓ కీలక ట్వీట్‌ను ఆయన షేర్ చేశారు.
ఉక్రెయిన్ మద్దతుగా నిలుస్తున్న ఆయనను ఉద్దేశిస్తూ రష్యా అధికారి నుంచి ఓ బెదిరింపు పోస్ట్ వచ్చింది. 'ఉక్రెయిన్‌లోకి కమ్యూనికేషన్ సామగ్రిని పంపించి, నాజీ దళాలకు సహకారంలో మీ భాగస్వామ్యం ఉంది. ఈ పరిణామానికి మీరు మూల్యం చెల్లించుకుంటారు' అనే రష్యా అధికారి పంపిన మెసేజ్‌ను మస్క్ షేర్ చేశారు. ఇక ప్రపంచ దేశాల్లో తమకు వ్యతిరేకంగా ఉన్న ప్రముఖులను రష్యా లక్ష్యంగా చేసుకుని, వారిని హత్య చేస్తుందనే ఆరోపణలున్నాయి. అవన్నీ అనుమానాస్పద మృతులుగా నమోదవుతుంటాయి. దీనిని ప్రస్తావిస్తూ ఎలాన్ మస్క్ తాజా ట్వీట్ చేసి ఉంటారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.