సభ్యసమాజం తలదించుకునే రీతిలో కొందరు దుర్మార్గులు వ్యవహరించారు. పచ్చి బాలింతపై సామూహిక అత్యాచారం చేశారు. అంతటితో ఆగకుండా బండరాయితో తలపై మోది, దారుణంగా హత్య చేశారు. తల్లి రాలేదని తెలుసుకోలేని ఆమె ఏడు నెలల బాబు గుక్క పెట్టి ఏడుస్తున్నాడు. ఆ పసిబిడ్డను సముదాయించడం ఎవరి తరం కాలేదు. ఈ అమానుష ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
ఏపీలోని సత్యసాయి జిల్లా కనగానపల్లి మండలానికి చెందిన మహిళకు ఏడు సంవత్సరా క్రితం వివాహమైంది. ఏడు నెలల క్రితం ఆమె ఓ పండంటి బాబుకు జన్మనిచ్చింది. పది రోజుల క్రితమే ఆమె ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేయించుకుంది. ఇక సోమవారం ఆమె తన కుమారుడిని చూసుకోవాలని తోటి కోడలికి అప్పగించింది. ఆ తర్వాత బహిర్భూమికి వెళ్లింది. ఎంతసేపైనా ఆమె తిరిగి రాకపోవడంతో బంధువులు ఆమె కోసం వెతికారు. ఆమె భర్తకు ఫోన్ చేసి విషయం చేరవేశారు. చివరికి ఊరి బయట తల ఛిద్రమై, నిర్జీవంగా పడి ఉండడం ఆమె బంధువులు గమనించారు. వారి నుంచి సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని దర్యాప్తు చేపట్టారు. ఆమెను సమీపంలోని బండరాళ్లతో కొట్టి చంపారని అంచనా వేశారు. అంతకు ముందు సామూహిక అత్యాచారం కూడా జరిగిందనే అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ విషయంలో నలుగురు బంధువులపైనే అనుమానాలు తలెత్తాయి. మృతురాలి ఫోన్ కాల్ ఆధారంగా పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.