పాకిస్తాన్ తాజా మాజీ ప్రధాని, ప్రస్తుత ప్రధానీల మధ్య మాటల వార్ కొనసాగుతోంది. పదవీచ్యుతుడైన పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌కు తాజా ప్రధాని షాబాజ్ షరీఫ్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఇమ్రాన్ తన నోటిని అదుపులో పెట్టుకుంటే మంచిదని హితవు పలికారు. దేశ ప్రజలను, వ్యవస్థలను కించపరచడం మానుకోవాలని, లేదంటే చట్టపరమైన చర్యలు తీసుకోక తప్పదని హెచ్చరించారు.
ఇమ్రాన్ ఇటీవల మాట్లాడుతూ.. తనను పదవీచ్యుతుడిని చేస్తున్నప్పుడు తటస్థంగా ఉండి చూస్తున్నవారంతా జంతువులేనంటూ ఆర్మీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. అలాగే, ఈ నెల 20న 30 లక్షల మందితో ఇస్లామాబాద్‌లో భారీ ర్యాలీకి ఇమ్రాన్ పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో షాబాజ్ తాజాగా మాట్లాడుతూ.. ఇమ్రాన్‌పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. దేశానికి వ్యతిరేకంగా కుట్ర చేస్తూ ఆర్మీని రెచ్చగొడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో పౌర యుద్ధానికి ఇమ్రాన్ ప్రయత్నిస్తున్నారని ప్రధాని ఆరోపించారు.