శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం క్రమంగా రాజకీయ సంక్షోభానికి దారి తీసింది. ఈ నేపథ్యంలో పెరిగిన పెట్రోల్ ధరలు, విద్యుత్ ఛార్జీలు, నిత్యావసరాల ధరల పెంపుపై ప్రజలు కన్నెర్ర చేశారు. కొన్నాళ్లుగా ఆ దేశంలో ప్రజాగ్రహం మిన్నంటుతోంది. శ్రీలంక అధ్యక్షుడు గొటబయ రాజపక్స, మాజీ ప్రధాని మహింద రాజపక్స నివాసాలపై దాడులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అక్కడి ఆర్మీ కీలక నిర్ణయం తీసుకుంది. కనిపిస్తే కాల్చివేత నిర్ణయాన్ని అమలు చేయాలని నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే అల్లర్ల కట్టడి చేసేందుకు ఆర్మీకి దేశాధ్యక్షుడు గొటబయ రాజపక్స విస్తృత అధికారులు ఇచ్చారు. ప్రజల ఆందోళన నేపథ్యంలో సోమవారం ప్రధాని పదవికి మహింద రాజపక్స రాజీనామా చేశారు. నేవీ సంరక్షణలో ఉన్న పోర్టులో కుటుంబంతో సహా ఆశ్రయం పొందుతున్నారు.
సోమవారం ఆందోళనకారులు ఆ దేశ ఎంపీ ప్రేమదాసపై దాడి చేశారు. తప్పించుకున్నా ఆందోళనకారులు వెంటపడి మరీ దాడి చేశారు. మాజీ ప్రధాని మహింద రాజపక్స ఇంటితో పాటు పలువురి రాజకీయ నేతల ఇళ్లను ఆందోళనకారులు తగులబెడుతున్నారు. ఇప్పటి వరకు శ్రీలంకలో ఆందోళనల వల్ల ఏడుగురు మృతి చెందారు. 11 మంది విషమ పరిస్థితుల్లో ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. 260 మందికి తీవ్రగాయాలయ్యాయి. ఐసీయూలో 60 మంది చికిత్స పొందుతున్నారు. గాయపడిన వారిలో ముగ్గురు టూరిస్టులు ఉన్నారు. ఈ పరిస్థితులను చూడలేక ఆ దేశంలో ఓ బౌద్ధ మత గురువు ఒకరు ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. లంకలో ఎక్కడ చూసినా కనిపించే ఈ దృశ్యాలు పలువురిని కలిచి వేస్తున్నాయి.