ఎండా కాలం రాగానే చాలా మంది ఐస్ క్రీమ్‌లను ఇష్టంగా తినేస్తుంటారు. పిల్లల నుంచి పెద్దల వరకు ఐస్ క్రీమ్‌లు అంటే ఇష్టపడని వారుండరు. అయితే ఎక్కువగా ఏది చేసినా అనర్థమేనని పెద్దలు అంటారు. ఇది ఐస్ క్రీమ్‌ల విషయంలోనూ వర్తిస్తుంది. ఎక్కువగా ఐస్‌క్రీమ్‌లను ఆరగిస్తే కొన్ని నష్టాలున్నాయని ఆహార నిపుణులు చెబుతున్నారు. మార్కెట్‌లో రకరకాల ఫ్లేవర్లు ఉంటాయి. ఇక మూడు కప్పుల ఐస్ క్రీమ్‌లను తింటే అందులో వెయ్యికి పైగా కేలరీలు ఉంటాయి. వీటి వల్ల గుండె జబ్బులతో పాటు ఊబకాయం పెరగడానికి కారణం అవుతుంది. ప్రాసెస్ చేసిన కార్బోహైడ్రేడ్లు ఐస్‌క్రీమ్‌లలో అధికంగా ఉంటాయి. ఇవి పొట్ట భాగంలో కొవ్వు పేరుకుపోవడానికి, రక్తంలో షుగర్ లెవెల్స్‌ను పెంచడానికి దారి తీస్తాయి.
ఐస్ క్రీమ్‌లలో అధిక చక్కెర ఉండడంతో జ్ఞాపక శక్తి తగ్గుతుంది. ఇక ఎక్కువ మంది ఇష్టపడే ఫ్లేవర్ వెనీలా ఐస్ క్రీమ్‌లో గుండె ధమనులకు హానిచేసే కొవ్వు 10 గ్రాములు ఉంటుంది. ఐస్ క్రీమ్‌కు త్వరగా జీర్ణమయ్యే గుణం లేదు. దీంతో రాత్రి వేళ దీనిని తింటే కడుపు ఉబ్బరం, అజీర్ణం, కడుపు నొప్పి తలెత్తే అవకాశం ఉంది. అందుకే ఎంతో ఇష్టమైన ఐస్ క్రీమ్‌ను తగు స్థాయిలో తింటే ప్రయోజనాలు ఉంటాయని, అధిక మొత్తంలో తింటే ఇబ్బంది తప్పదని నిపుణులు సూచిస్తున్నారు.