తెలుగుతేజం తిలక్ వర్మ ఐపీఎల్ 2022 సీజన్‌లో మరోసారి మెరిశాడు. గురువారం సీఎస్‌కేతో జరిగిన మ్యాచ్‌లో 98 పరుగుల లక్ష్య చేధనలో 33 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి ముంబై కష్టాల్లో పడింది.ఘీ దశలో తిలక్ వర్మ 34 పరుగులు నాటౌట్ చివరి వరకు నిలబడి జట్టును గెలిపించడంలో యాంకర్ పాత్ర పోషించాడు.తిలక్ వర్మ అండతో ఆఖర్లో టిమ్ డేవిడ్ రెండు సిక్సర్లతో 16 పరుగులతో జట్టును విజయతీరాలకు చేర్చాడు.
కాగా మ్యాచ్ విజయం అనంతరం ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ తిలక్ వర్మపై ప్రశంసల వర్షం కురిపించాడు. ''తిలక్ వర్మ ఒక బ్రిలియంట్. ఆడుతున్న తొలి సీజన్‌లోనే ఇంతలా రాణించడం గొప్ప విషయం. కచ్చితంగా టీమిండియా తరపున అన్ని ఫార్మాట్లలో అతను ఆడతాడనే నమ్మకం ఉంది. అతని టెక్నిక్, ఆత్మవిశ్వాసం, టెంపర్‌లెస్ అతన్ని ఉన్నతస్థాయి ఆటగాడిగా నిలబెడతాయి. అతనికి మంచి భవిష్యత్తు ఉందని మాత్రం చెప్పగలను. ఇక ప్లేఆఫ్ అవకాశాలు లేనప్పటికి.. విజయాలతో సీజన్‌ను ముగించాలనుకుంటున్నాం. జట్టులో కొత్త ఆటగాళ్లను పరిశీలిస్తాం.. జట్టుకు ఆడాల్సినవాళ్లు చాలామంది ఉన్నారు. వాళ్లందరికి అవకాశం వచ్చేలా చూస్తాం. అంటూ'' చెప్పుకొచ్చాడు.అయితే తిలక్ వర్మ రాణించడం ఇది మొదటిసారి కాదు. వాస్తవానికి సూర్యకుమార్ తర్వాత చెప్పుకోదగ్గ రీతిలో రాణించింది తిలక్ వర్మే. ముంబై ఇండియన్స్ తరపున తిలక్ వర్మే టాప్ స్కోరర్ కావడం విశేష. ఇప్పటివరకు తిలక్ 12 మ్యాచ్‌ల్లో 368 పరుగులు సాధించాడు. ఇందులో రెండు అర్థసెంచరీలు ఉన్నాయి. తిలక్ వర్మ రూపంలో టీమిండియాకు మరో ఆణిముత్యం దొరికేసినట్లే. ముంబై ఇండియన్స్ ఫేలవ ప్రదర్శన కారణంగా తిలక్ వర్మ ఇన్నింగ్స్‌లు ఉపయోగపడలేదు.