ప్రకృతి విపత్తులను ఎదుర్కోవడంలో తగిన మెళకువలను నేర్పించడం ద్వారా విపత్తులను ఎదుర్కొనే సామర్ధ్యాన్ని యువతలో పెంపొందించడమే లక్ష్యమని నెహ్రూ యువకేంద్రం యూత్ ఆఫీసర్ జి. విక్రమాదిత్య పేర్కొన్నారు. అన్ని స్థాయిల్లోని వ్యక్తుల్లో విపత్తులను ఎదుర్కొనే నైపుణ్యాలు పెంపొందించడం ద్వారా విపత్తులు సంభవించినపుడు వాటివల్ల కలిగే నష్టాన్ని తగ్గించగలమన్నారు. జిల్లాలో పర్యటిస్తున్న ఎన్. డి. ఆర్. ఎఫ్. బృందం శుక్రవారం స్థానిక నెహ్రూ యువకేంద్రంలో జిల్లాలోని యువ వలంటీర్లకు ప్రకృతి విపత్తుల నిర్వహణలో అవగాహన కల్పించారు. విపత్తు ప్రభావాన్ని తగ్గించడంలో వివిధ విభాగాల మధ్య సమన్వయంతో కూడిన చర్యలు అవసరమని విక్రమాదిత్య పేర్కొన్నారు.
ఈ సందర్భంగా అగ్నిప్రమాదాలు సంభవించినపుడు బాధితులను తరలించే విషయమే అవగాహన కల్పించేందుకు మాక్ డ్రిల్‌ను నిర్వహించారు. భూకంపాలు, మెరుపులు, పాముకాటు వంటి ఘటనలు సంభవించినపుడు ఎలాంటి ప్రాథమిక చికిత్సలు అందించాలి, ఏవిధంగా స్పందించాలనే అంశాలపై అవగాహన కల్పించారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో అందుబాటులో వున్న వనరులతో గుండెపోటు వంటి వ్యాధులకు గురైన వారికి ప్రథమ చికిత్స ఏవిధంగా అందించాలనే అంశంపై అవగాహన కల్పించారు. ఒత్తిడిని తగ్గించడం, ధ్యానం, యోగ తదితర అంశాలపై డా. చైతన్య స్వప్న అవగాహన కల్పించారు. రూరల్ తహశీల్దార్ రవి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని రెవిన్యూ సిబ్బందికి, యువ వలంటీర్లకు శిక్షణ ఇచ్చారు.