టెలికాం రంగంలో మొత్తం మార్కెట్ ను ఎయిర్ టెల్, జీయో ఆక్రమించేస్తున్నాయి. రిలయన్స్ జియో, ఎయిర్ టెల్ క్రమంగా మార్కెట్ వాటాను పెంచుకుంటూ పోతున్నాయి. ఎప్పటికప్పుడు కొత్త కస్టమర్లను సంపాదించుకుంటున్నాయి. ముఖ్యంగా జియోను దాటేసి ఎయిర్ టెల్ ఎక్కువ మంది కస్టమర్ల ఆదరణను చూరగొంటోంది. మరి ఈ సంస్థలకు కొత్త కస్టమర్లు ఎక్కడి నుంచి వస్తున్నారని అనుకుంటున్నారా..? పోటీ సంస్థలైన వొడాఫోన్ ఐడియా, బీఎస్ఎన్ఎల్ నుంచే.
మార్చి నెలకు సంబంధించి టెలికం సబ్ స్క్రయిబర్ల వివరాలను ట్రాయ్ విడుదల చేసింది. ఎయిర్ టెల్ 22.5 లక్షల కొత్త చందాదారులను మార్చి నెలలో తన నెట్ వర్క్ పరిధిలోకి చేర్చుకుంది. జియో నెట్ వర్క్ లోకి కొత్తగా 12.6 లక్షల మంది యూజర్లు వచ్చారు. అదే సమయంలో వొడాఫోన్ ఐడియా నెట్ వర్క్ నుంచి 28.1 లక్షల మంది కస్టమర్లు వెళ్లిపోయారు. బీఎస్ఎన్ఎల్ కూడా లక్షకు పైగా కస్టమర్లను కోల్పోయింది.
వైర్ లెస్ సబ్ స్క్రయిబర్ల సంఖ్య 114.29 కోట్లకు చేరింది. వైర్ లైన్ చందాదారుల సంఖ్య 2.45 కోట్లకు పెరిగింది. జియో 35.37 శాతం వాటాతో అతిపెద్ద సంస్థగా ఉంది. 31.55 శాతం వాటాతో ఎయిర్ టెల్ రెండో స్థానంలో, 22.83 శాతం వాటాతో వొడాఫోన్ ఐడియా తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. మార్చి నెలలో 96.4 లక్షల మంది కస్టమర్లు పోర్ట్ ఆప్షన్ పెట్టుకున్నారు.