ఇద్దరు సీనియర్ ఎగ్జిక్యూటివ్ లను ట్విట్టర్ తొలగించింది. 4,400 కోట్ల డాలర్లకు ట్విట్టర్ ను ఎలాన్ మస్క్ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. అతి త్వరలోనే అధికారికంగా ఆయన ట్విట్టర్ యజమాని కాబోతున్నారు. ఈ నేపథ్యంలోనే సంస్థ సీఈవోగా పరాగ్ అగర్వాల్ ను తప్పించి.. కొన్నాళ్లపాటు ఆయనే సీఈవోగా బాధ్యతలు చేపడతారన్న ప్రచారం సాగుతోంది.
అయితే, తాజాగా ఇద్దరు అధికారులు సంస్థను వీడారని సంస్థ ప్రతినిధులు వెల్లడించారు. రీసెర్చ్, డిజైన్ అండ్ ఇంజనీరింగ్ విభాగాన్ని లీడ్ చేస్తున్న జనరల్ మేనేజర్ కేవ్యాన్ బేక్పూర్, ప్రొడక్ట్స్ విభాగం అధిపతి బ్రూస్ ఫాల్క్ లు రాజీనామా చేశారని చెప్పారు. అయితే, ఆ వార్తలపై కేవ్యాన్ వివరణ ఇచ్చారు. సంస్థను వీడాలన్న ఊహ కూడా తనకు లేదని, కావాలనే తనను పంపించేశారని ఆయన చెప్పారు. ప్రస్తుతం తాను పితృత్వ సెలవుల్లో ఉన్నానని పేర్కొన్నారు. సంస్థ ఉద్యోగులను ప్రత్యేకమైన దారిలో తీసుకెళ్లాలనుకుంటున్నట్టు సీఈవో పరాగ్ అగర్వాల్ చెప్పారని, తనను రాజీనామా చేయాలన్నారని తెలిపారు.
మరోవైపు ఈ వారం నుంచి కొత్త నియామకాలనూ నిలిపివేస్తున్నట్టు సంస్థ ప్రకటించింది. పనికి అవసరమైన అత్యంత ముఖ్యమైన నియామకాలు తప్ప మిగతా నియామకాలను చేపట్టబోమని స్పష్టం చేసింది. సంస్థ పగ్గాలను మస్క్ చేపట్టడాన్ని పరాగ్ సహా కొందరు సీనియర్ అధికారులు వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే.