ఏపీలో పదో తరగతి ప్రశ్నాపత్రాల లీక్ వ్యవహారం మలుపులు తిరుగుతోంది. దీనికి నారాయణ విద్యాసంస్థల వ్యవస్థాపకుడు, టీడీపీ మాజీ మంత్రి నారాయణ కారణమని ఏపీ సర్కారు ఆరోపిస్తోంది. దీనిపై పోలీసులు ఇప్పటికే ఆయనపై కేసు పెట్టి, అరెస్టు చేశారు. ఆయనకు కోర్టు బెయిల్ కూడా మంజూరు చేసింది. నారాయణ విద్యాసంస్థలతో తనకు ఇప్పుడు ఎలాంటి అనుబంధం లేదని ఆయన కోర్టులో చెప్పారు. ఈ తరుణంలో విద్యాసంస్థల యాజమాన్యంలో భాగమైన ఆయన కుటుంబ సభ్యులు హైకోర్టును ఆశ్రయించారు. తమను ఏపీ పోలీసులు అరెస్టు చేయకుండా ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరారు. దీనిపై స్పందించిన హైకోర్టు వారికి ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఈ నెల 18 వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశించింది.
నారాయణ కుమార్తెలు పొంగూరు శరణి, పొంగూరు సింధూర, అల్లుడు కె.పునీత్‌లతోపాటు విద్యా సంస్థకు చెందిన మరికొందరు హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ వేశారు. దీనిని జస్టిస్ కె.మన్మథరావు విచారణ చేపట్టారు. వారికి ముందస్తు బెయిల్ మంజూరు చేసి, తదుపరి విచారణను మే 18కు ఆయన వాయిదా వేశారు. ఈనెల 18 వరకు పిటిషనర్ల విషయంలో తొందరపాటు చర్యలు తీసుకోవద్దంటూ రాష్ట్ర ప్రభుత్వానికి న్యాయస్థానం సూచించింది.