ఐపీఎల్-2022లో లీగ్ మ్యాచ్‌లు చివరి దశకు చేరుకున్నాయి. ఈ క్రమంలో సోమవారం సాయంత్రం 7:30 గంటలకు ముంబైలోని డాక్టర్ డీవై పాటిల్ స్టేడియంలో పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య ఆసక్తికర పోరు జరగనుంది. ఢిల్లీ క్యాపిటల్స్ గత ఏడు మ్యాచ్‌లలో ఐదుసార్లు పంజాబ్‌ను ఓడించింది. ఈ సీజన్ ప్రారంభంలోనూ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ విజయం సాధించింది. దీంతో ఇరు జట్ల మధ్య నేడు హోరాహోరీ పోరు సాగనుంది. మయాంక్ అగర్వాల్ నేతృత్వంలోని పంజాబ్ జట్టు ప్రదర్శన పడుతూ లేస్తూ అన్నట్లు ఉంది. ఢిల్లీ పరిస్థితి కూడా అంతే. అయితే పటిష్ట రాజస్థాన్‌ను గత మ్యాచ్‌లో ఢిల్లీ ఓడించింది. ఆ ఆత్మవిశ్వాసంతో మరో గెలుపు సాధించేందుకు రిషబ్ పంత్ జట్టు ఉవ్వీళ్లూరుతోంది.
ఢిల్లీ జట్టులో కీలక యువ ఆటగాడు పృథ్వీ షా అనారోగ్యం నుంచి కోలుకుని తిరిగి జట్టులో చేరనున్నాడు. దీంతో ఆ జట్టు బ్యాటింగ్ విభాగం బలోపేతం కానుంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఢిల్లీ 5వ స్థానంలో ఉండగా, పంజాబ్ 7వ స్థానంలో ఉంది. ఇరు జట్లుకు 12 పాయింట్లు ఉన్నా, నెట్ రన్ రేట్‌లో ఢిల్లీ మెరుగ్గా ఉండడంతో పాయింట్ల పట్టికలో ముందంజలో ఉంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టుకు ప్లే ఆఫ్ అవకాశాలు మెరుగవుతాయనడంలో ఏ మాత్రం సందేహం లేదు. దీంతో ఎలాగైనా ఈ మ్యాచ్‌లో గెలిచి తీరాలని ఇరు జట్లు పట్టుదలతో ఉన్నాయి.