ఏదైనా రెస్టారెంట్‌లో సింగిల్ చికెన్ బిర్యానీ ధర రూ.300ల వరకు ఉంటుంది. ఎంత పెద్ద రెస్టారెంట్ అయినా మహా అయితే రూ.1000కి మించదు. అయితే ఓ వ్యక్తి మాత్రం తాను సరఫరా చేసిన బిర్యానీకి రూ.3 లక్షల బిల్లు వేశాడు. దీంతో ఆ బిల్లు చూసిన వారు అవాక్కయ్యారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలిలా ఉన్నాయి.
పశ్చిమ బెంగాల్‌లోని కత్వా సబ్ డివిజనల్ ఆస్పత్రికి సౌవిక్ ఆలం అనే వ్యక్తి ఇటీవల ఆసుపత్రి సూపరింటెండెంట్‌గా బాధ్యతలు చేపట్టారు. కొంతకాలంగా పెండింగ్ బిల్లులను క్లియర్ చేయాలని సిబ్బంది ఆయనకు కొన్ని ఫైళ్లను సమర్పించారు. వాటిని గమనిస్తున్న క్రమంలో ఆయన ఒక్కసారిగా అవాక్కయ్యారు. ఒక్క బిర్యానీ కోసం దాదాపు రూ.3 లక్షలు తప్పుడు బిల్లులు పెట్టినట్లు గుర్తించి విస్తుపోయారు. కింగ్‌షూక్ అనే కాంట్రాక్టర్ ఆ ఆసుపత్రికి ఫర్నీచర్, ఫార్మసీ, వాహనాల ఖర్చులతో బిర్యానీ సరఫరా చేస్తుంటాడు. వాటి నిమిత్తం ఏకంగా రూ.3 కోట్లకు పైగా బిల్లులు పెట్టాడు. వాటిని విచారించిన అధికారులకు దిమ్మ తిరిగింది. ఏకంగా 81 దొంగ బిల్లులు సమర్పించినట్లు తేలింది. రూ.3 లక్షల బిర్యానీని అతడు సరఫరా చేశాడా అనే విషయంపై అధికారులు విచారణ చేపట్టారు. పేషెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ స్పెషల్ వెరిఫికేషన్ కమిటీ సమావేశం పెట్టి, వారి నుంచి వివరాలు సేకరించారు. దీంతో ఆ కాంట్రాక్టర్ బండారం బట్టబయలైంది. బిల్లులు ప్రాసెస్ చేయడంలో ఆసుపత్రి సిబ్బంది పాత్ర కూడా ఉందని తేలింది. తప్పుడు బిల్లులు పెట్టిన కాంట్రాక్టర్‌తో పాటు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న ఉద్యోగుల పైనా కఠిన చర్యలు ఉంటాయని అధికారులు వెల్లడించారు.