అసోంలో వరద ప్రభావం ఎక్కువగా ఉంది. అనేక ప్రాంతాలు నీటి మునిగిపోయాయి. పంటపొలాలు, రహదారులు జలమయమయ్యాయి. ఈ క్రమంలో ఒక రైలు కూడా వరదలో చిక్కుకుంది.ఆదివారం.. సిల్చార్ నుంచి గువహటి వెళ్తున్న ఎక్స్‌ప్రెస్ రైలు చాచర్ సమీపంలో వరద నీటిలో చిక్కుకుపోయింది. భారీ వర్షం కారణంగా వరద పెరగడంతో రైలు పట్టాలపైనే నిలిచిపోయింది. పట్టాలు మునిగిపోయేంత వరకు నీళ్లు రావడంతో రైలు ఎటూ కదలలేని పరిస్థతి వచ్చింది. దీంతో అందులోని ప్రయాణికులు రైలులో చిక్కుకుపోయారు. వరద మట్టం పెరుగుతుండటంతో ఆందోళనకు గురయ్యారు.అయితే, ప్రయాణికుల్ని ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ సిబ్బంది కాపాడారు. జిల్లా అధికారులు ఇచ్చిన సమాచారంతో రంగంలోకి దిగిన సైన్యం, ప్రత్యేక హెలికాప్టర్ల ద్వారా రక్షణ చర్యలు చేపట్టింది. రైలులో చిక్కుకున్న 119 మంది ప్రయాణికుల్ని హెలికాప్టర్లలో సురక్షితంగా తరలించింది. అసోంలో ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలకు అనేక ప్రాంతాలు వరదమయం అయ్యాయి. కొండచరియలు విరిగిపడటంతో రహదారులు, రైలు మార్గాలు స్తంభించిపోయాయి. ఇప్పటికే లోతట్టు ప్రాంతాల ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.