నారాయణపేట జిల్లా మాగనూరు మండల కేంద్రంలో స్వయంభువుగా వెలసిన శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా రథోత్సవం మంగళవారం తెల్లవారుజామున అంగరంగ వైభవంగా నిర్వహించారు. అంతకుముందు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఉత్సవ విగ్రహాన్ని రథం లో ఉంచి డప్పుల చప్పుళ్లు, కోలాహలం మధ్య స్థానిక యువకులు వందలాదిగా రథాన్ని లాగారు. రథోత్సవాన్ని తిలకించడానికి చుట్టుపక్కల గ్రామాల నుండే కాకుండా బొంబాయి, అంబర్ నాథ్ తదితర ప్రాంతాల నుంచి కూడా భక్తులు తరలివచ్చారు. మంగళవారం సాయంత్రం పాల ఉట్ల కార్యక్రమం ఉంటుందని ఈ కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో తరలి రావాలని ఆలయ అధికారులు తెలిపారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా మక్తల్ సీఐ సీతయ్య, మాగనూరు ఎస్ఐ నరేందర్ ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహించారు.