జిల్లాలో ముందస్తు సాగునీటి విడుదల కోసం నిర్ణయం తీసుకొనేందుకు ఈ నెల 18న జిల్లా నీటిపారుదల సలహా మండలి సమావేశం నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ పి. రంజిత్ బాషా చెప్పారు. వ్యవసాయశాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వ్యవసాయశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య, నీటిపారుదల ముఖ్యకార్యదర్శి శశిభూషణ్, వ్యవసాయశాఖ కమిషనర్ హరినారాయణ్ తదితరులు ఈ కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు.
మంత్రులు గోవర్ధన్ రెడ్డి, రాంబాబులు మాట్లాడుతూ నీటి ప్రాజెక్టులలో పుష్కలంగా నీరు ఉండటం వల్ల ముందుగానే నీ టిని విడుదల చేస్తున్నామన్నారు. అందువల్ల నీటి పారుల సలహా మండలి, జిల్లా వ్యవసాయ సలహా మండలి సమావేశాలు నిర్వహించి రైతులు కోరిన మేరకు నీటిని విడుదల చేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి. రంజిత్ బాషా మాట్లాడుతూ ఈ నెల 18వ తేదీన నిర్వహించనున్న నీటి పారుదల సలహా మండలి సమావేశంలో రైతులకు నీరు ఎప్పుడు అవసరమవుతుందో తెలుసుకుంటామన్నారు.
వరినాట్లకు, పిల్లి పెసర పంటలకు ఎంత నీరు అవసరమవుతుందో రైతుల నుంచి తెలుసుకుని ఆ సలహా మండలిలో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. రైతులకు అవసరమైన ఎరువులు, విత్తనాలు పంపిణీ చేసేందుకప జిల్లా యంత్రాంగం సంసిద్ధంగా ఉందని కలెక్టర్ స్పష్టం చేశారు. క్రిమిసంహార మందులకు జిల్లాల్లో కొదవలేదని తెలిపారు. గత ఏడాది కంటే 15 రోజులు ముందుగానే రైవస్, ఏలూరు కాల్వలకు నీరు విడుదలచేయనుండడంపై రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారని కలెక్టర్ మంత్రుల దృష్టికి తీసుకెళ్లారు. సమగ్ర కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసి అమలు చేస్తామని చెప్పారు.
జిల్లా నీటి పారుదల సలహామండలి, జిల్లా వ్యవసాయ సలహా మండలి సమావేశాలకు జిల్లా ఇన్ ఛార్జి మంత్రి ఆర్. కె. రోజా, గృహనిర్మాణ శాఖ మంత్రి, జిల్లా మంత్రి జోగి రమేష్, ఎమ్మెల్యేలు అందరినీ ఆహ్వానిస్తామని కలెక్టర్ చెప్పారు.