కరోనా నిబంధనల కారణంగా గత రెండు సంవత్సరాలుగా కుప్పంలోని తిరుపతి గంగమ్మ అమ్మవారికి జాతర నిర్వహించలేక పోయారు. జిల్లాలోనే కాక పరిసర జిల్లాలకు కూడా ప్రతిష్టాత్మకంగా నిర్వహించే తిరుపతి గంగమ్మ అమ్మవారి జాతర, ఈ ఏడాది పెద్ద ఎత్తున నిర్వహించడానికి ప్రజాప్రతినిధులు, ఆలయ కమిటీ చైర్మన్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జాతర సందర్భంగా అమ్మవారి ఆలయానికి భక్తుల తాకిడి ఎక్కువ సంఖ్యలో ఉంటుందన్న అంచనాలకు అనుగుణంగా పోలీసులతో భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేస్తున్నట్లు అర్బన్ సిఐ శ్రీధర్ పేర్కొన్నారు.
అర్బన్ సిఐ శ్రీధర్ మాట్లాడుతూ. జాతర ముసుగులో ఆకతాయిలు మహిళల పట్ల యువతుల పట్ల అసభ్యంగా ప్రవర్తించినట్లు పోలీసుల దృష్టికి వస్తే వారిని ఉపేక్షించేది లేదని వారిపై వెంటనే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ముఖ్యంగా యువకులు ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలని పోలీసులకు కనబడితే వెంటనే అరెస్టు చేయడం మరియు రౌడీ షీట్ ఓపెన్ చేయడం జరుగుతుందని తెలిపారు. యువకులు, పురుషులు జాతర సందర్భంగా మద్యం సేవించి ఆలయానికి వచ్చే మహిళల పట్ల ఇతరుల పట్ల అసభ్యంగా ప్రవర్తించినట్లు తెలిస్తే కఠిన చర్యలు తప్పవని శ్రీధర్ హెచ్చరించారు. అమ్మవారి జాతర భక్తితో ప్రశాంత వాతావరణంలో జరిగేలా అందరూ సహకరించాలని కోరారు.