ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బలమైన శక్తిగా ఎదిగేందుకు బిజెపి కొత్త పంథాలో పయనిస్తూ ఉందా. ఒకప్పుడు తన పాత మిత్రుడిగా ఉన్న టిడిపికి బిజెపి దూరంగా ఉండటానికి ప్రయత్నించడం ఈ వ్యూహంలో భాగమేనా. అంటే అవుననే అంటున్నాయి రాజకీయ వర్గాలు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తుల గురించి ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో జనంతోనే తమ పార్టీ పయనిస్తుందని సోము వీర్రాజు వ్యాఖ్యానించారు. ఒకవేళ అవసరం అనుకుంటే జనసేన పార్టీతో కలుస్తామని, కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ తెలుగు దేశం పార్టీ (టీడీపీ)తో కలిసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. అవసరం అనుకుంటే జనసేన పార్టీతో పొత్తు పెట్టుకుంటామని సోము వీర్రాజు చెప్పడం ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం జనసేన, బీజేపీలు అదికారికంగా పొత్తులోనే ఉండగా.. అవసరం అనుకుంటే జనసేనతో కలుస్తామని చెప్పడం వెనక అర్థం ఏంటనేది హాట్ టాపిక్‌గా మారింది.
2014 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, జనసేన, టీడీపీ కూటమిగా పోటీ చేసి ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఆ ఎన్నికల్లో జనసేన పోటీకి దూరంగా ఉండగా.. బీజేపీ 4 ఎమ్మెల్యే, 2 ఎంపీ స్థానాలు గెలుపొందింది. అయితే, కొన్నాళ్లకే ఎన్టీఏ కూటమి నుంచి టీడీపీ బయటకు వచ్చేసింది. మోదీ సర్కారుకు వ్యతిరేకంగా చంద్రబాబు పెద్ద ఎత్తున ఆందోళనలు కూడా చేశారు. దీంతో టీడీపీతో పొత్తు అంటేనే బీజేపీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అలాగే, టీడీపీతో పొత్తు వల్ల తాము సంస్థాగతంగా ఎదగలేకపోతున్నామన్న భావన బీజేపీలో ఉంది. దీంతో టీడీపీతో ఇకపై పొత్తు పెట్టుకునేది లేదని సోము వీర్రాజు మరోసారి తేల్చిచెప్పారు.