రోడ్డుపక్కన నిద్రిస్తున్న వలస కూలీల ప్రాణాలు తెల్లారకుండానే గాలిలో కలిసిపోయాయి. హరియాణాలోని ఝాజ్జర్‌లో ఈ దారుణం చోటు చేసుకుంది. ఫుట్ పాత్ పై నిద్రిస్తున్న వలస కూలీలపైకి ఓ లారీ దూసుకెళ్లడంతో ముగ్గురు మృతి చెందగా, 11 మందికి గాయాలయ్యాయి.గురువారం తెల్లవారు జామున కుండలీ – మనేసర్ – పాల్వాల్ హైవేపై ఈ ఘటన చోటు చేసుకుంది. వీరంతా ఉత్తర ప్రదేశ్‌కు చెందిన వారు. అశోద టోల్ ప్లాజా సమీపంలో జరుగుతున్న వంతెన నిర్మాణ పనుల్లో కూలీలుగా పనిచేస్తున్నారు. మొత్తం 18మందికాగా వీరిలో 14 మంది పని అనంతరం విరామంకోసం సమీపంలోని ఫుట్ పాత్ పై సేదతీరేందుకు వెళ్లారు.తెల్లవారు జాము సమయం కావడంతో గాఢనిద్రలోకి జారుకున్నారు. ఈ క్రమంలో ఓ లారీ అదుపుతప్పి కూలీలపైకి దూసుకెళ్లి బోల్తా పడింది. ఈ ఘటన అనంతరం డ్రైవర్ పరారయ్యారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి వెళ్లి పరిశీలించారు. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే ముగ్గురు మృతిచెందగా వారి మృతదేహాలను పోస్టుమార్ట నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. ప్రమాదంలో గాయపడ్డ 10మంది పీజీఐఎంఎస్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఒక వ్యక్తిని చికిత్స కోసం బహదూర్‌ఘర్‌లోని ట్రామా సెంటర్‌లో చేర్చారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.