మొన్నటి వరకు యావత్తు ప్రపంచాన్ని కరోనా వైరస్ వివిధ వేరియంట్ల రూపంలో వెంటాడితే తాజాగా మంకీ ఫాక్స్ వణికిస్తోంది. తాజాగా ఈ వ్యాధి ఒక దేశం నుంచి ఇంకో దేశానికి నెమ్మదిగా పాకుతుంది. ఇప్పటికే 12 దేశాలకు ఈ వైరస్ పాకింది. తాజాగా ఇజ్రాయెల్, స్విట్జర్లాండ్‌లో మంకీపాక్స్ కేసులు నమోదయ్యాయి. విదేశాల నుంచి వచ్చిన వ్యక్తిని పరీక్షించగా మంకీపాక్స్‌గా తేలినట్టు అక్కడి అధికారులు వెల్లడించారు. అతనిని ప్రస్తుతం టెల్ అవీవ్ ఆస్పత్రిలో ఉంచి చికిత్స అందిస్తున్నట్టు ఇజ్రాయెల్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.
ఈ మేరకు ఇతర దేశాల నుంచి వచ్చిన వారు జ్వరం, శరీరంపై గాయాలతో బాధపడితే వెంటనే డాక్టర్లను సంప్రదించాలని అక్కడి ఆరోగ్య మంత్రిత్వ శాఖ సూచించింది. అలాగే మరిన్ని అనుమానిత మంకీపాక్స్ కేసులను డాక్టర్లు పరిశీలిస్తున్నట్టు వెల్లడించింది. మరోవైపు స్విట్జర్లాండ్‌లో మంకీపాక్స్ కలకలం నెలకొంది. అక్కడ కూడా తొలి కేసు నమోదు కాగా.. ఆ బాధితుడికి కాంటాక్ట్ అయిన వారందరినీ ఆ దేశ ఆరోగ్య శాఖ పరీక్షిస్తుంది.
ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో 80కిపైగా మంకీపాక్స్ కేసులను గుర్తించినట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. ఈ మేరకు 50 అనుమానిత కేసులున్నాయి. గతంలో ఈ కేసులు పశ్చిమ ఆఫ్రికాతో సంబంధాలున్న వ్యక్తుల్లో మాత్రమే కనిపించాయి. కానీ ఇప్పుడు అమెరికా, బ్రిటన్, స్పెయిన్, పోర్చగల్, ఇటలీ, స్వీడన్, కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, బెల్జియం, ఆస్ట్రేలియాల్లో కూడా ఈ కేసులు గుర్తించారు.
ఈ వ్యాధి సోకినవారిలో మశూచి బారిన పడిన వారిలో ఉండే లక్షణాలే కనిపిస్తున్నాయి. బాధితులు జ్వరం, ఒళ్లు నొప్పులు, అలసట సమస్యలతో బాధపడుతున్నారు. అలాగే ముఖం, చేతులు, శరీరంలోని ఇతర భాగాలపై దద్దుర్లు, గాయాలు ఏర్పడుతున్నాయి. మొట్టమొదటగా 1958లో ఈ వ్యాధిని కోతుల్లో గుర్తించారు. అందుకే దానికి మంకీపాక్స్ అని పేరు పెట్టారు. అయితే 1970లో మనుషుల్లో తొలికేసు నమోదైంది. అయితే ఈ వ్యాధితో ఇప్పటి వరకూ ఎటువంటి మరణం సంభవించలేదు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదికలు ప్రకారం మంకీపాక్స్ వైరస్ సోకిన పదిమందిలో ఒకరు మాత్రమే చనిపోయే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఈ వ్యాధికి మశూచి వ్యాధికి వినియోగించే మందులనే వాడుతున్నారు.
సాధారణంగా ఈ మంకీపాక్స్ వైరస్ జంతువుల నుంచి మనుషులకు సోకుతుంది. ఇప్పటికే ఆ వ్యాధి బారిన పడిన జంతువును కొరికినా, వాటి మాంసాన్ని సరిగ్గా ఉడికించకుండా తిన్నా వైరస్ సోకుతుంది వ్యాధి సోకిన వారికి దగ్గరగా ఉండడం వల్ల, వారి తుంపర్ల నుంచి అంటుకునే అవకాశం ఉంది. మంకీపాక్స్ సోకిన వారిలో కనీసం నెల రోజుల వరకూ ఇంకొకరికి వ్యాపించే ఛాన్స్ ఉంటుందని వైద్య నిపుణులు అంటున్నారు.