కోల్‌కతా: క్రికెట్ అనేది ఓ అంచనా వేయలేని ఆట. ఈ గేమ్‌లో ఎప్పుడు ఏవైపైనా మ్యాచ్ మలుపు తిరగొచ్చు అన్న ఉద్దేశంలో ఈ మాట అంటూ ఉంటారు. ఓ మ్యాచ్‌లో ఓ టీమ్ పనైపోయిందని మ్యాచ్ ముగిసే వరకూ అనడానికి వీల్లేదు. అలాగే దినేష్ కార్తీక్ లాంటి క్రికెటర్ల పని కూడా అయిపోయినట్లు భావించడం పొరపాటే అవుతుంది. మూడేళ్లు నేషనల్ టీమ్‌కు దూరంగా ఉండి.. 36 ఏళ్ల వయసులో, యువకుల నుంచి పోటీ తీవ్రంగా ఉండే టీ20 టీమ్‌లోకి తిరిగి రావడం అనేది మాటలు కాదు. కానీ కార్తీక్ అది చేసి చూపించాడు.
ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్ తరఫున బెస్ట్ ఫినిషర్‌గా మారి మరోసారి సెలక్టర్ల దృష్టిలో పడిన అతడు.. సౌతాఫ్రికాతో జరగబోయే టీ20 సిరీస్‌కు ఎంపికయ్యాడు. ఈ సందర్భంగా ఆర్సీబీ టీమ్ ఓ స్పెషల్ వీడియోను రూపొందించింది. అందులో టీమిండియాకు మళ్లీ ఎంపిక కావడంపై కార్తీక్ స్పందించాడు. "చాలా సంతోషంగా ఉంది. చాలా చాలా సంతృప్తిగా ఉంది. ఇది నా స్పెషల్ కమ్‌బ్యాక్ అని కచ్చితంగా చెప్పొచ్చు. ఎందుకంటే చాలా మంది నా పనైపోయిందని అనుకున్నారు" అని కార్తీక్ ఆ వీడియోలో అన్నాడు.
"దీనంతటికీ నేను నా కోచ్ అభిషేక్ నాయర్‌తో కలిసి చేసిన ప్రాక్టీస్, వేలానికి ముందు జరిగిన సంఘటనలు, ఆ తర్వాత నేను ప్రాక్టీస్ చేసిన విధానం.. ఇందులో ఆర్సీబీ హెడ్ కోచ్ సంజయ్ బంగార్, మైక్ హెసెన్‌లకు కూడా క్రెడిట్ దక్కుతుంది. టీమ్‌లో నా రోల్ ఏంటో వాళ్లు స్పష్టంగా చెప్పారు. నన్ను వేలంలో తీసుకున్నందుకు, ఈ రోల్ ఇచ్చినందుకు, నాపై నమ్మకం ఉంచినందుకు ఆర్సీబీకి ఎప్పటికీ రుణపడి ఉంటాను" అని కార్తీక్ చెప్పాడు.
సెలక్టర్లు, కెప్టెన్ రోహిత్ శర్మ, కోచ్ రాహుల్ ద్రవిడ్‌లకు కూడా ఈ సందర్భంగా థ్యాంక్స్ చెప్పాడు. "సెలక్టర్లు, రోహిత్, ద్రవిడ్‌లకు కచ్చితంగా క్రెడిట్ దక్కుతుంది. ఎందుకంటే ఈ రోజుల్లో సెలక్షన్ కోసం ఎంతోమంది యువ ఆటగాళ్లు సిద్ధంగా ఉన్నారు. అయినా నాపై నమ్మకం ఉంచడం ఎంతో బాగా అనిపించింది. వరల్డ్‌కప్‌కు ఇంకా చాలా సమయం ఉంది. అయితే ఆలోపు టీమ్‌తో ఉండటం, నా స్కిల్స్ చూపించడానికి అవకాశం దక్కడం చాలా గర్వంగా ఉంది" అని కార్తీక్ అన్నాడు.