రాత్రి, పగలు అనే తేడా లేకుండా వందలాది ట్రాక్టర్ల ఇసుక తవ్వకాలు. గత నాలుగు నెలల్లో రూ.50 కోట్ల ఇసుకను అమ్ముకున్న అక్రమార్కులు. రెవెన్యూ, పోలీసు యంత్రాంగాలకు ఇదంతా తెలుసు. అయినా పట్టించుకోరు. ఎందుకంటే ఈ అక్రమాలకు అండగా ఉన్నది నర్సీపట్నం వైసీపీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర గణేష్ అంటున్నారు టీడీపీ నాయకులూ. ఉత్తరాంధ్రలోని కల్యాణపులోవ రిజర్వాయరు నుంచి ప్రవాహంగా వచ్చిన సర్పానది మాకవరపాలెం మండలంలో పలు గ్రామాల మీదుగా ప్రవహిస్తూ ఇసుక మేటలు వేస్తుంటుంది. జంగాలపల్లి అనే గ్రామానికి పక్కగా ప్రవహించే సర్పానదిని ఆనుకుని ఉన్న ప్రభుత్వ భూమిలో వేల టన్నుల ఇసుక మేటలు వేసి ఉంది. ఆ ఇసుకనే వైసీపీ అక్రమార్కులు వందల లారీలలో తరలించుకుపోతున్నారు. స్థానికులు అడిగితే దౌర్జన్యం చేస్తున్నారు. తహశీల్దారు అనుమతులు ఇవ్వలేదని అంటారు. తహశీల్దార్ ఇచ్చిన అనుమతులతోనే ట్రాక్టర్లను పట్టుకునే పరిస్థితి లేదని పోలీసులు చెపుతున్నారు. దోపిడీ మాత్రం సాఫీగా జరిగిపోతోంది అని వీడియో సాక్షిగా , సోషల్ మీడియా వేదికగా తెలియజేసారు.