బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం దేశ సమాఖ్య నిర్మాణాన్ని కూలదోస్తోందని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. కేంద్ర దర్యాప్తు సంస్థలను వాడుకుంటూ కేంద్రం రాష్ట్రాల వ్యవహారాల్లో తల దూర్చుతోందని మండిపడ్డారు.
కోల్ కతాలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మమత మాట్లాడుతూ, అడాల్ఫ్ హిట్లర్, జోసెఫ్ స్టాలిన్, బెనిటో ముస్సోలిని వంటి నియంతలకన్నా బీజేపీ పాలన అధ్వానంగా ఉందని వ్యాఖ్యానించారు. దేశంలో తుగ్లక్ పాలన నడుస్తోందన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణ దిశగా కేంద్ర దర్యాప్తు సంస్థలకు స్వతంత్ర ప్రతిపత్తి కల్పించాలని స్పష్టం చేశారు. వాటిలో ఎలాంటి రాజకీయ జోక్యానికి తావులేని రీతిలో చర్యలు తీసుకోవాలని, నిష్పాక్షికతకు పెద్దపీట వేయాలని తెలిపారు.