మధ్యప్రదేశ్ కు చెందిన ఓ మహిళకు లీజుకు తీసుకున్న గనిలో 2.08 క్యారెట్ల వజ్రం దొరికింది. దీని విలువ రూ.10 లక్షలు ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. పన్నా జిల్లాలోని ఇత్వాకలా గ్రామంలో నివసించే చమేలి బాయి అనే మహిళ కృష్ణ కల్యాణ్‌పుర్ పాటి ప్రాంతంలో వజ్రాల గనిని లీజుకు తీసుకుంది. ఈ గనిలో తాజాగా ఆమెకు వజ్రం దొరికింది.
చమేలి బాయి దంపతులు ఈ వజ్రాన్ని పన్నా డైమండ్ ఆఫీస్ లో మంగళవారం అధికారుల వద్ద డిపాజిట్ చేశారు. దీనికి ప్రభుత్వ నిబంధనల ప్రకారం ధర నిర్ణయిస్తారు. త్వరలో వేలం వేస్తారు. వజ్రం నాణ్యతను బట్టి దీనికి రూ.10 లక్షల వరకు పలకొచ్చని అధికారులు తెలిపారు. వేలంలో వచ్చిన ధర నుంచి పన్నులు, రాయల్టీలను మినహాయించి మిగిలిన మొత్తాన్ని మహిళకు అప్పగిస్తామని చెప్పారు.