బీహార్ కు చెందిన సీమా కుమారి అనే పదేళ్ల బాలిక రెండేళ్ల క్రితం ఓ రోడ్డు ప్రమాదంలో తన కాలుని కోల్పోయింది. దీంతో ఆ బాలిక కిలో మీటర్ దూరంలో ఉన్న స్కూల్ కు ఒక్క కాలితో గెంతుతూ వెళ్తోంది. బాలిక స్కూల్ కి వెళ్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. విషయం తెలుసుకొన్న నటుడు సోనూసూద్ బాలిక కాలు చికిత్సకు సాయం అందిస్తానని ప్రకటించారు.
సీమా తల్లిదండ్రులు ఇటుకల తయారీ పనికి వెళ్తారు. ప్రభుత్వం తమకు సహాయం చేయాలని కోరుతున్నారు. సీమా గురించిన కథనాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వైద్య శాఖ స్పందించింది. అధికారులు వచ్చి సీమా కాలిని పరిశీలించారు. ఆమెకు కృత్రిమ కాళ్లను అమర్చాలని నిర్ణయించారు. జముయీ మేజిస్ట్రేట్ అవ్నీశ్ కుమార్ సింగ్ ఆ బాలికకు 3 చక్రాల కుర్చీని అందజేశారు.