మంకీపాక్స్ వైరస్ ఇప్పటివరకు 19 దేశాలకు విస్తరించింది. తాజాగా ఆస్ట్రియా, స్లొవేనియా, చెక్ రిపబ్లిక్ దేశాల్లో ఈ వైరస్ కేసులు నమోదయ్యాయి. అన్ని దేశాల్లో కలిపి ఇప్పటివరకు 131 కేసులు నిర్ధారణ అయ్యాయి. మరో 106 అనుమానిత కేసులు ఉన్నట్లు డబ్ల్యూహెచ్ఓ తెలిపింది. దీంతో ఆఫ్రికా కాకుండా ఇతర దేశాల్లోనే మొత్తం 237 మంకీపాక్స్ కేసులు నమోదైనట్లు తెలుస్తోంది. రానున్న రోజుల్లో ఈ వైరస్ మరిన్ని దేశాలకు విస్తరించే అవకాశం ఉందని డబ్ల్యూహెచ్ఓ అంచనా వేస్తోంది. అయితే దీనివల్ల ముప్పు మాత్రం తక్కువేనని డబ్ల్యూహెచ్ఓ స్పష్టం చేసింది.
మంకీపాక్స్ వైరస్ మ్యుటేషన్ చెందిందని చెప్పడానికి ఆధారాలు లేవని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. కేసుల పెరుగుదలకు కారణాలేంటనే దానిపై ఇంకా స్పష్టత లేదని తెలిపింది. వీటి మూలాలు కనుక్కోవడంతో పాటు వైరస్ లో మార్పులను తెలుసుకోవడానికి శాస్త్రవేత్తలు ప్రయత్నాలు చేస్తున్నారని తెలిపింది. జ్వరం, ముఖంపై దద్దుర్లు, ఒళ్లునొప్పుల వంటి లక్షణాలు కనిపించే ఈ వ్యాధి వల్ల ఇప్పటివరకు ఒక్క మరణం కూడా సంభవించలేదు.