ఏదైనా అనారోగ్యంతో బాధపడేవారికి డాక్టర్లను దేవుళ్లుగా కొలుస్తుంటుంటారు. అయితే కొందరు డాక్టర్ల నిర్లక్ష్యంతో ఘోరం జరిగింది. అభంశుభం తెలియని పసివారికి హెచ్ఐవీ సోకింది. వారిలో ఒకరు చనిపోవడం అందరినీ కన్నీళ్లు పెట్టిస్తోంది. మరో ముగ్గురు ప్రస్తుతం చావుబతుకుల్లో కొట్టుమిట్టాడుతున్నారు. ఈ విషాదకర ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
మహారాష్ట్రంలోని నాగ్‌పూర్‌లో తలసేమియాతో బాధపడుతున్న నలుగురు చిన్నారులను వారి తల్లిదండ్రులు ఓ ఆసుపత్రిలో చికిత్స చేయిస్తున్నారు. ఈ వ్యాధితో బాధపడే వారికి తరచూ రక్తమార్పిడి చేయాల్సి ఉంటుంది. చికిత్సలో భాగంగా కొంత కాలం క్రితం అనుకోకుండా ఆ చిన్నారులకు హెచ్ఐవీ పాజిటివ్ రక్తాన్ని వైద్యులు ఎక్కించారు. దీంతో నలుగురు చిన్నారులకు హెఐవీ వ్యాపించింది. అందులో ఒకరు మృతి చెందగా, ముగ్గురు ప్రాణాపాయ పరిస్థితుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటన స్థానికంగా సంచలనం కాగా ఆ రాష్ట్ర వైద్యారోగ్య మంత్రి రాజేష్ తోపే స్పందించారు.
ఈ అంశంపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి, వాస్తవాలను తెలియజేయాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ఆరోగ్య శాఖ అసిస్టెంట్ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ ఆర్కే ధాకటే స్పందిస్తూ చిన్నారులకు హెచ్ఐవీ సోకిన విషయాన్ని ధ్రువీకరించారు. తలసేమియాతో బాధపడుతున్న ఆ చిన్నారులకు సమీపంలోని బ్లడ్ బ్యాంకు నుంచి రక్తం రప్పించి, ఎక్కిస్తున్నారని చెప్పారు. అయితే అందులో హెచ్ఐవీ సోకిన రక్తం కావడంతో చిన్నారులకు కూడా హెచ్ఐవీ వచ్చిందన్నారు. దీనిపై పూర్తి స్థాయి దర్యాప్తు చేస్తున్నామని మీడియాకు వివరించారు.