టీడీపీ పెద్ద పండుగకు సర్వం సిద్ధమైంది. ఏటా వచ్చే పసుపు పండుగ తెలుగుదేశం శ్రేణుల వేడుకకు ఈసారి ఒంగోలు వేదికయింది. శుక్ర, శనివారాల్లో రెండు రోజుల పాటు జరగనున్న తెలుగుదేశం పార్టీ మహానాడుకు సర్వం సిద్ధమైంది.మరికొద్ది గంటల్లో మహానాడు ప్రారంభం కానుంది. కరోనా కారణంగా గత రెండేళ్లుగా ఆన్‌లైన్ పద్దతిలో జరిగిన మహానాడును ఈసారి అత్యంత వైభవంగా నిర్వహించాలని పార్టీ భావిస్తోంది. అందుకు అనుగుణంగానే ఒంగోలు సమీపంలోని మండవవారి పాలెం వద్ద 80 ఎకరాల సువిశాల మైదానంలో మహానాడు జరుగుతోంది. దీనికి ఎన్టీఆర్ ప్రాంగణంగా పేరు పెట్టారు. ఇప్పటికే టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ఒంగోలుకు చేరుకున్నారు. గురువారం మంగళగిరి నుంచి చంద్రబాబు కార్లు, బైక్ ర్యాలీలతో ఒంగోలు చేరుకోగా.. అడుగడుగునా టీడీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు.మహానాడు సందర్భంగా టీడీపీ శ్రేణులు శుక్రవారం ఒంగోలు బాట పట్టనున్నారు. ఈ మహానాడుకు రాష్ట్రం నలుమూలల నుంచి 10వేల మంది ప్రతినిధులు హాజరు కానున్నారని తెలుస్తోంది. రెండు రోజుల పాటు జరిగే ఈ మహానాడులో వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా, వైసీపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై విపక్ష పార్టీగా పోరాటాలను పదునెక్కించడం, రెండు రాష్ట్రాల్లోనూ పార్టీని మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా విస్తృత చర్చ జరగనుంది. తొలిరోజు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి 20 నుంచి 30వేల మంది ప్రతినిధులు దీనికి హాజరుకానున్నారు. తెలంగాణ నుంచి టీడీపీ ప్రతినిధులు రైళ్లు, వాహనాల్లో తరలిరానున్నారు.
ఆంధ్రప్రదేశ్ లోని తెదేపా నేతలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర నేతలు ఈ మహానాడుకు హాజరవుతారు. ఈ సారి మహానాడులో రెండు రాష్ట్రాలకు సంబంధించి 17 తీర్మానాలపై చర్చించనున్నారు. ఇదిలా ఉంటే మహానాడులో జనసేనతో పొత్తు అంశంపై స్పష్టత వచ్చే అవకాశమున్నట్లు టాక్ నడుస్తోంది. టీడీపీ శ్రేణుల్లో ఇప్పటికే జనసేనతో పొత్తు ఉంటే లాభమనే ఆశాభావం వ్యక్తమవుతోంది. బీజేపీతో ఎటువంటి వైఖరి అవలంభిస్తారో కూడా మహానాడు వేదికగా స్పష్టత వచ్చే అవకాశముంది.
ఇదిలా ఉంటే నేటి ఉదయం 10గంటలకు ప్రతినిధుల నమోదుతో మహానాడు ప్రారంభమవుతుంది. ఫొటో ఎగ్జిబిషన్, తర్వాత రక్తదాన శిబిరం ఉంటుంది. అనంతరం పార్టీ పతాకావిష్కరణ, మా తెలుగు తల్లి గేయాలాపన, జ్యోతి ప్రజ్వలనతో సమావేశాలు మొదలవుతాయి. అనంతరం ఎన్టీఆర్ విగ్రహానికి పుష్పాంజలి, తర్వాత ఇటీవలి కాలంలో మరణించిన పార్టీ నేతలు, కార్యకర్తలకు సంతాపం ప్రకటిస్తారు. ప్రధాన కార్యదర్శి నివేదిక, జమా ఖర్చుల నివేదిక, నియమావళి సవరణలను ప్రవేశపెడతారు. చంద్రబాబు ప్రారంభోపన్యాసం, సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి.