ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఉగ్రవాదానికి వ్యతిరేకంగా అందరూ పనిచేయాలి: దోవల్

national |  Suryaa Desk  | Published : Sat, May 28, 2022, 03:27 PM

ఉగ్రవాదాన్ని నిరోధించడానికి తజికిస్థాన్, రష్యా, చైనా, ఉజ్బెకిస్థాన్, కజకిస్థాన్, ఇరాన్, కిర్గిజిస్థాన్ కలిసి పని చేయాలని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ పిలుపునిచ్చారు. అఫ్గన్ ప్రజలతో భారతీయులకు శతాబ్దాలుగా ప్రత్యేక అనుబంధం ఉందని, అఫ్గనిస్థాన్‌లో భారత్ ముఖ్యమైన భాగస్వామి అని ఆయన స్పష్టం చేశారు. తజికిస్థాన్ రాజధాని దుషాంబే వేదికగా శుక్రవారం అఫ్గనిస్థాన్‌పై జరిగిన నాలుగో ప్రాంతీయ భద్రత సదస్సులో అజిత్ దోవల్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా అఫ్గన్‌కు భారత్ చేస్తున్న మానవతా సాయం గురించి కూడా ఆయన వెల్లడించారు. పాకిస్థాన్ భూమార్గం గుండా ఆ దేశానికి 50 వేల మెట్రిక్ టన్నుల గోధుమలను అందజేస్తామని హామీ ఇచ్చామని, ఇప్పటికే 17 వేల మెట్రిక్ టన్నులను పంపామని తెలిపారు.


అలాగే, ఐదు లక్షల కోవిడ్ టీకా డోస్‌లు, 13 వేల టన్నుల అత్యవసర ఔషధాలు, 60 మిలియన్ డోస్‌ల పోలియో వ్యాక్సిన్‌లు, శీతాకాల దుస్తులను అందించడానికి ముందుకొచ్చామన్నారు. ఈ సదస్సులో పాల్గొన్న రష్యా జాతీయ భద్రతా సలహాదారు నికోలాయ్ పత్రుషెవ్.. అఫ్గనిస్థాన్ నుంచి మధ్య ఆసియా దేశాలకు శరణార్థుల ప్రవాహం, తీవ్రవాదం ముప్పు గురించి ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఉగ్రవాదాన్ని నిరోధించడానికి తజికిస్థాన్, రష్యా, చైనా, ఉజ్బెకిస్థాన్, కజకిస్థాన్, ఇరాన్, కిర్గిజిస్థాన్ కలిసి పని చేయాలని దోవల్ పిలుపునిచ్చారు. ‘‘ప్రాంతీయ శాంతి, భద్రతకు ముప్పుగా పరిణమించే తీవ్రవాదం, తీవ్రవాద గ్రూపులను ఎదుర్కోవడానికి అఫ్గనిస్థాన్ సామర్థ్యాన్ని పెంపొందించాల్సి ఉందన్నారు.


మహిళలు, బాలికలపై తాలిబన్లు ఆంక్షల విధించడంతో అంతర్జాతీయ సమాజం నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ విషయాన్ని ప్రస్తావించిన దోవల్‘‘జీవించే హక్కు, గౌరవప్రదమైన జీవనం అలాగే అందరి మానవ హక్కుల పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి’’ అని నొక్కిచెప్పారు. ‘‘ఏ సమాజం భవిష్యతుకైనా మహిళలు, యువతకే కీలకం.. బాలికలకు విద్య.. మహిళలు, యువతకు ఉపాధి కల్పించడం వల్ల ఉత్పాదకత, వృద్ధికి ఊతమిస్తుంది’’ అని దోవల్ అభిప్రాయపడ్డారు. ఇది యువతలో తీవ్రవాద భావజాలాన్ని నిరోధించడంతోపాటు సానుకూల సామాజిక ప్రభావం కూడా కలిగి ఉంటుందని అభిప్రాయపడ్డారు.


మహిళలు, మైనారిటీలతో సహా అఫ్గన్ సమాజంలోని అన్ని వర్గాల ప్రాతినిధ్యకు కల్పించే సమ్మిళిత ప్రభుత్వం అవసరమన్న భారత వైఖరిని దోవల్ నొక్కిచెప్పారు. అఫ్గనిస్థాన్‌తో భారత్‌కు చారిత్రక, నాగరికత సంబంధాలు ఉన్నాయని, అక్కడ ప్రజలకు ఎల్లవేళలా అండగా నిలుస్తున్నామని చెప్పారు. దశాబ్దాలుగా అఫ్గన్‌లో మౌలికవసతులు, కనెక్టివిటీ, మానవతా సహాయం అందజేస్తోందని వివరించారు. రష్యా, ఇరాన్, తజికిస్థాన్ ప్రతినిధులతో దోవల్ ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించారు. ఈ సమావేశానికి చైనా తరఫున ఆ దేశ విదేశాంగ శాఖ భద్రత కమిషనర్ చెంగ్ గౌపింగ్ హాజరయ్యారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com