ఏ పని అయినా వినోదమైనా వాటినుంచి పొందే ఆనందానికి ఓ పరిమితి విధించుకోవాలి. లేకపోతే అది వ్యసనంగా మారే ప్రమాదముంది. ఆ వ్యసనం హద్దు దాటితే ప్రాణాల మీదకే తెలుస్తుంది. అలాంటి ఘటనే మలేషియాలో చోటు చేసుకొంది. మన దేశంలో తక్కువేగానీ విదేశాల్లో చాలా మంది టాయిలెట్‌కి వెళ్లి పేపర్ లేదా బుక్ చదువుతారు. కొంతమంది మొబైల్‌లో వీడియో గేమ్స్ ఆడతారు. ఇది కరెక్టా కాదా అన్నది అలా ఉంచితే మలేసియాలో ఓ వ్యక్తికి ఇలాంటి అలవాటు ఉంది. అతను వీడియోగేమ్స్ బాగా ఆడతాడు. పేరు సబ్రీ తజాలీ. వయసు 28 ఏళ్లు. టాయిలెట్‌లో కూర్చున్నప్పుడు అతని సీటు పై పాము ఎలా కాటువేసిందో, ఆ తర్వాత ఏమైందో వివరిస్తూ వీడియో గేమ్స్ ఆడటం వల్లే తాను ఇబ్బందుల్లో పడ్డానని చెప్పుకొచ్చాడు.
సెలాయంత్‌లో నివసిస్తున్న అతను ట్విట్టర్‌లో ఫొటోలు పోస్ట్ చేసి విషయం చెప్పాడు. లెట్రిన్ నుంచి ఆ పాము పైకి వచ్చిందని తెలిపాడు. పైకి వచ్చిన పాము ఒక్కసారిగా సీటుపై కాటు వేసింది. ఆ సమయంలో దాని కోరలు సీటులో గుచ్చుకుపోయాయి. వాటిని వెనక్కి లాక్కోవడం పాము వల్ల కాలేదు. వెంటనే పైకి లేచాడట. అతనితోపాటూ పాము కూడా వేలాడిందట. ఆ కంగారులో ఏదేదో చెయ్యగా చివరకు పాము ఎగిరి ఎక్కడో పడిందట. వెంటనే బాత్‌రూమ్ వదిలి వేరే గదిలోకి పారిపోయాడు.
ఆ తర్వాత రెస్క్యూ ఆపరేషన్ జరిగింది. స్థానిక ఫైర్ అండ్ రెస్క్యూ డిపార్ట్‌మెంట్ వారు పామును పట్టుకొని... అడవుల్లో వదిలేశారు. ఐతే... అది విషపూరితమైన పాము కాదట. అందువల్ల ప్రాణానికి ఏ సమస్యా రాలేదు. కానీ ఆస్పత్రికి వెళ్లిన సబ్రీకి యాంటీ-టెటనస్ ఇంజెక్షన్ ఇచ్చారు. "టు బీ హానెస్ట్.. ఈ ఘటన తర్వాత టాయిలెట్‌కి వెళ్లాలంటేనే భయపడుతున్నాను. అది తలచుకుంటేనే ఒళ్లు జలదరిస్తోంది" అని సబ్రీ తెలిపాడు.
ఈ ఘటన జరిగిన రెండు వారాల తర్వాత సీటు దగ్గర నొప్పి వస్తుంటే... మళ్లీ డాక్టర్ల దగ్గరకు వెళ్లాడు సబ్రీ. వాళ్లు చెక్ చెయ్యగా... పాము కోరలు అక్కడే ఇరుక్కుపోయినట్లు గుర్తించారు. వాటిని తొలగించారు. గతేడాది ఆస్ట్రియాలో ఇలాగే జరిగింది. ఓ వ్యక్తి తన ఇంట్లోని టాయిలెట్‌కి వెళ్లగా... భారీ కొండచిలువ టాయిలెట్ నుంచి వచ్చి కాటేసింది. అది పక్క అపార్ట్‌మెంట్ నుంచి డ్రైనేజీ ద్వారా వచ్చినట్లు గుర్తించారు. అతన్ని వృషణాలపై పాము కాటేసింది. అది బొల్లి వచ్చిన కొండ చిలువగా గుర్తించారు. అతన్ని డాక్టర్లు కాపాడారు.
ప్రస్తుతం ఎండాకాలమైనా వర్షాలు పడుతున్నాయి కాబట్టి... పాములతో జాగ్రత్తగా ఉండాలి. వానలు పడినప్పుడు పాములు జోరుగా తిరుగుతాయి. వాటికి ఎక్కడ ఉండాలో తెలియక... ఇళ్లలోకి వస్తుంటాయి. ఇళ్లలో పిల్లలు ఇరుకైన ప్రదేశాల్లోకి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే పాములు ఇళ్లలో అలాంటి చీకటి ప్రదేశాల్లోనే దాక్కుంటాయి.