మారుతున్న జీవన శైలీలో మనం జట్టురాలడం పరిపాటిగా చూస్తున్నాం. ఎన్ని మందులు వచ్చినా దీనికి పరిష్కారం మాత్రం దొరకడంలేదు. తాజాగా ఓ శుభవార్త మాత్రం అందింది. అయితే ఆ మందులకు అనుమతులు మాత్రం రావాల్సి వుంది. ఇదిలావుంటే ఈమధ్య ఓ కోర్టు జుట్టు లేని వారికి బట్టతల ఉంది అని అనడం నేరం అని తెలిపింది. కాబట్టి మనం ఈ స్టోరీలో ఎక్కడా అలా చెప్పుకోకుండా మామూలుగా చెప్పుకుందాం. ది సన్ రిపోర్ట్ ప్రకారం... పరిశోధకులు ఓ కొత్త మాత్రని కనిపెట్టారు. అది చాలా మందికి జుట్టు తిరిగి వచ్చేలా చేస్తోందట. ఆరు నెలల్లోనే ఒత్తైన, నిండైన జుట్టు వస్తోంది. ఆ మాత్ర అద్భుత ఫలితాలు చూపిస్తోంది అని తెలిపారు. ఆ మాత్రను వాడేవారిలో సగం మందికి జుట్టు తిరిగి ఆరు నెలల్లో వస్తోందని తెలిపారు. బాల్డ్‌నెస్ సమస్యకి ఇదో ముఖ్యమైన మైలురాయి లాంటి పరిష్కారం అని సైంటిస్టులు తెలిపారు. అంటే ఇక హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్లతో పనిలేదు అనుకోవచ్చు.
ఈ టాబ్లెట్‌ని రోజుకు రెండుసార్లు వేసుకోవాలట. ఇది అలోపెసియా అరీటా అనే అంశంపై తన ప్రతాపం చూపిస్తుందని తెలిపారు. ఈ అలోపెసియా అరీటా అనేది ఎన్ హెచ్ ఎస్ ప్రకారం యూకే (బ్రిటన్)లోని ప్రతి 10వేల మందిలో 15 మందిపై ప్రభావం చూపిస్తోంది. దీని వల్లే జుట్టు రాలిపోతోంది. వివిధ వయసుల వారికి ఇలా జరుగుతోందని తెలిపారు.
చెప్పాలంటే అలోపెసియా అరీటా అనేది ఆటోఇమ్యూన్ డిసీజ్ అంటున్నారు. అంటే... దీని వల్ల జుట్టు కుదుళ్లే... జుట్టుకి ఉండే వ్యాధి నిరోధక శక్తిపై దాడి చేస్తాయి. ఈ దాడిని పొరపాటుగా చేస్తాయట. ఎలా చేస్తేనేం... జుట్టైతే రాలుపోతుంది. ఈ వ్యాధి వల్ల కొందరికి కొద్ది ప్రాంతంలోనే జుట్టు రాలుతుంది. మరికొందరికి తల మొత్తం జుట్టు రాలుతుందట. ఈ వ్యాధికి ఇప్పటివరకూ సరైన మందు లేదు. కొన్ని డ్రగ్స్ మాత్రం జుట్టు తిరిగి వచ్చేలా కొంతవరకూ చెయ్యగలుగుతున్నాయని చెబుతున్నారు.
ఈ కొత్త మాత్రను కాన్సెర్ట్ ఫార్మాస్యూటికల్స్ అనే మందుల తయారీ కంపెనీ తయారుచేసింది. దీన్ని అమెరికాలో 706 మందిపై ప్రయోగాత్మకంగా పరీక్షించింది. ఈ పరీక్షల్లో పాల్గొన్నవారిలో కొద్దిగా జుట్టు రాలిన వారు ఓ గ్రూపుగా..., మొత్తం రాలిపోయిన వారు మరో గ్రూపుగా ఉన్నారు. కొద్దిగా రాలిన వారికి 8 మిల్లీగ్రాముల టాబ్లెట్స్‌ను రోజూ 2 వేసుకోమన్నారు. మొత్తం జుట్టు రాలిపోయిన వారికి 12 మిల్లీగ్రాముల టాబ్లెట్స్‌ను రోజూ రెండు వేసుకోమన్నారు. రెండు గ్రూపుల్లోనూ మంచి ఫలితాలు వచ్చాయట. చాలా మందికి కుదుళ్ల నుంచి జుట్టు మొలుస్తూ వచ్చిందట.
మొదటి గ్రూపులో 42 శాతం మందికీ... రెండో గ్రూపులో 30 శాతం మందికి... 80 శాతం జుట్టు తిరిగి వచ్చేసిందని తేల్చారు. ఈ మందు వాడిన వారిలో కొంతమందికి తలనొప్పి, మొటిమల లాంటి సైడ్ ఎఫెక్టులు వచ్చాయి. ఇంతకీ డ్రగ్ పేరు ఏంటంటే...సీటీపీ-543. అలోపెసియా అరీటాను తరిమికొట్టే సమయం వచ్చిందని పరిశోధకులు అంటున్నారు. త్వరలోనే ఎఫ్ డీఏ నుంచి మాత్ర తయారీకి అనుమతులు పొందుతామని అంటున్నారు. ఎఫ్ డీఏ గనుక అనుమతి ఇస్తే ఇక ఈ మందును అమెరికాలో భారీగా ఉత్పత్తి చేసి ప్రపంచవ్యాప్తంగా సప్లై చేసే ఛాన్స్ ఉంటుంది.