ఉక్రెయిన్, రష్యా మధ్య సాగుతున్న యుద్దానికి ముగ్గింపు ఎప్పుడు అన్నది అటుంచితే ఆ దేశాల యుద్దం ఇంకా ఎంత దూరం పోతుందోనన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఆ రెండు దేశాల మధ్యనెలకొన్న యుద్దం మూడో ప్రపంచయుద్దానికి దారి తీస్తుందా అన్న చర్చ కూడా సాగుతోంది. ఇదిలావుంటే ఉక్రెయిన్ పై రష్యా యుద్ధాన్ని మనం ఓ కంట కనిపెడుతూ ఉండాలి. ఎందుకంటే ఇది 21వ శతాబ్దంలో జరుగుతున్న ఆధునిక యుద్ధం. చేస్తున్నదేమో రష్యా. అది మామూలు దేశం కాదు.. అత్యంత పవర్‌ఫుల్ ఆయుధాల్ని తయారుచేసే దేశం రష్యా. కాబట్టి యుద్ధాన్ని ఎలాగైనా గెలిచేందుకు రష్యా ఎంతకైనా తెగించగలదు. అందుకే మెల్లమెల్లగా డోస్ పెంచుతోంది. 20 రోజుల కిందట థెర్మో లేజర్ కిరణాల ఆయుధాల్ని రంగంలోకి దింపిన రష్యా తాజాగా థెర్మోబారిక్ బాంబుల్ని ప్రయోగిస్తోంది. ఫిబ్రవరి 24న మొదలైన ఈ యుద్ధం... 3 నెలలు దాటినా కొనసాగుతూనే ఉంది. ఉక్రెయిన్ సేనలకు సాయం చేస్తున్న నాటో దళాలు అర్జెంటుగా రష్యా ప్రయోగిస్తున్నటువంటి బాంబుల్ని సప్లై చేయాలని ఉక్రెయిన్ ఆర్మీ కోరుతోంది. ఈ బాంబుల టెక్నాలజీ చిత్రంగా ఉంది. దీనిపై ఉక్రెయిన్ రక్షణ శాఖ ఓ ప్రకటన చేసింది. "రష్యా.. టోస్-1 మల్టిపుల్ రాకెట్ లాంచర్‌తో తూర్పున ఉన్న నోవోమీఖైలీవ్కా దగ్గర దాడులు చేసింది" అని చెప్పింది. ఆ రాకెట్ లాంచర్ థెర్మోబారిక్ బాంబుల్ని వదలగలదు. ఈ బాంబులు అత్యంత తీవ్రంగా ఎక్కువ వేడితో పేలేందుకు... చుట్టూ ఉన్న ఆక్సిజన్‌ని ఉపయోగించుకుంటాయి. అందువల్ల పేలుడు తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది.
థెర్మోబారిక్ బాంబులు అత్యంత ప్రాణాంతకమైనవని నిపుణులు అంటున్నారు. శత్రువుల స్థావరాల్ని నేలమట్టం చేసేందుకు వీటిని ఉపయోగిస్తారు. వీటి ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుంది. ఇవి గాలి మొత్తాన్నీ వాడేసుకుంటాయి. ఇవి పేలినప్పుడు గాలి మాయమవుతుంది. శత్రువులు గాలి పీల్చేందుకు ఆక్సిజన్ ఉండదు అని అంటున్నారు.
21వ శతాబ్దంలో ఇదే అతి పెద్ద యుద్ధం అని ఉక్రెయిన్ అంటోంది. తమకు మల్టిపుల్ రాకెట్ లాంచ్ వ్యవస్థలు ఇవ్వాలని నాటోను కోరుతోంది. తాజాగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కొత్త శాసనం చేశాడు. దాని ప్రకారం... రష్యా దళాలు ఆక్రమించిన ప్రాంతాల్లోని ఉక్రెయిన్లను... రష్యన్లుగా మార్చుకుంటామని తెలిపాడు. ఇది ఉక్రెయిన్ ప్రభుత్వానికి మరింత ఆగ్రహం తెప్పిస్తోంది. అలాగే... రష్యా సైన్యంలో మరింత మంది చేరేందుకు కూడా పుతిన్ ఏర్పాట్లు చేశాడు.
ఫిబ్రవరి 24, 2022 నుంచి మే 26, 2022 వరకూ... 29,600 మంది రష్యా సైనికులు చనిపోయినట్లు ఉక్రెయిన్ చెబుతోంది. అలాగే రష్యాకి చెందిన 1,315 ట్యాంకులు, 3,235 యుద్ధ వాహనాలు, 617 ఆయుధ వ్యవస్థలు, 201 మల్టిపుల్ రాకెట్ లాంచ్ వ్యవస్థలు, 93 యాంటీ ఎయిర్‌క్రాఫ్ట్ వ్యవస్థలు, 206 యుద్ధ విమానాలు, 170 హెలికాప్టర్లు, 2,225 మోటర్ వాహనాలు, 13 వెస్సల్స్, 502 మనుషులు లేని ఏరియల్ వెహికిల్స్, 114 క్రూయిజ్ మిస్సైళ్లను తాము నాశనం చేసినట్లు ఉక్రెయిన్ తెలిపింది.