దేశ రాజకీయాలలో సంచలన నిర్ణయాలకు ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వాలు కేంద్రంగా మారుతున్నాయి. మరీ ముఖ్యంగా పంజాబ్ ప్రభుత్వం ఈ విషయంలో మరింత స్పీడ్ పెంచింది. ఆ రాష్ట్రంలో ముఖ్యమంత్రి భగవంత్ మాన్ తనదైన పాలనతో దూసుకుపోతున్నారు. ఎప్పటికప్పుడు వినూత్నమైన నిర్ణయాలు తీసుకుంటూ అందరికీ షాక్ ఇస్తున్నారు. అవినీతి ఆరోపణలపై తన కేబినెట్‌లో మంత్రిని తొలగిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్న సీఎం భగవంత్ మాన్ తాజాగా మరో నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో 424 మంది ప్రముఖులకు ప్రభుత్వం కల్పించిన భద్రతను తొలగిస్తున్నట్టు సీఎం భగవంత్ మాన్ తెలిపారు.
అలా భద్రతను ఉపసంహరించుకున్న వారిలో రిటైర్డ్ పోలీసు అధికారులు, మతపెద్దలు, రాజకీయ ప్రముఖులు కూడా ఉన్నారు. భద్రతా సిబ్బందిని తాత్కాలిక ప్రాతిపదికన ఉపసంహరిస్తున్నట్టుయ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. జూన్ 6న ఆపరేషన్ బ్లూస్టార్ 38వ వార్షికోత్సవానికి సంబంధించిన కార్యకలాపాల కారణంగా భద్రతను తొలగించినట్టు పంజాబ్ పోలీసు భద్రతా విభాగంలోని సీనియర్ అధికారి తెలిపారు. ఈ క్రమంలో భద్రతా సంస్థలు ఇప్పటికే అప్రమత్తమయ్యాయి. శాంతిభద్రతల పరిరక్షణ కోసం కేంద్రం ఇప్పటికే 2,000 మంది పారామిలట్రీ సిబ్బందిని పంపించింది.
ఇదిలావుంటే గత ఏప్రిల్‌లో మాజీ మంత్రులు, ఎమ్మెల్యేతో సహా 184 మందికి భద్రతను ఉపసంహరిస్తూ పంజాబ్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. వారిలో పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్నీ, అతని కుటుంబ సభ్యులు, అమరిందర్ సింగ్ కుమారుడు, అతని భార్య, కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రతాప్ సింగ్ బజ్వావర్ కూడా ఉన్నారు. ఇదిలావుంటే ఇటీవల అక్రమాలకు పాల్పడుతున్నారనే కారణంతో రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి విజయ్ సింగ్లాను.. సీఎం భగవంత్ మాన్ సింగ్ పదవి నుంచి తొలగించారు. వస్తువుల కొనుగోలు టెండర్లలో కమీషన్ అడుగుతున్నారనే ఆరోపణలు విజయ్ సింగ్లాపై వచ్చాయి. దానికి సంబంధించిన ఆధారాలు కూడా ఉన్నాయని, తాము ఒక శాతం అవినీతిని కూడా సహించబోమని సీఎం మాన్ అన్నారు. అనంతరం ఏసీబీ అధికారులు విజయ్ సింగ్లాను అరెస్ట్ చేశారు.