నేటికీ సరైన ఆహారం అందక ఎంతో మంది ప్రాణాలను వదులుతున్నారు. సాంకేతికత ఎంతో పెరిగినా ఇంకా ఆకలి మరణాలు కొనసాగుతునే ఉన్నాయి. నైజేరీయాలో తాజాగా ఆహారం కోసం ఒక్కసారిగా చర్చలోకి చొరబడి ఆ కారణంగా జరిగిన తొక్కిసలాటలో 31 మంది మరణించారు. అందులో పిల్లలే ఎక్కువగా ఉండటం మరింత ఆవేదనకు గురిచేస్తోంది.
దక్షిణ నైజీరియాలో దారుణం చోటుచేసుకుంది. ఓ చర్చ్ దగ్గర తొక్కిసలాటలో పదుల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. శనివారం తెల్లవారుజామున పోర్ట్ హార్కోర్ట్ నగరంలో ఓ చర్చ్ కార్యక్రమంలో తొక్కిసలాట జరిగింది. ఈ ప్రమాదంలో 31 మంది మరణించారు. మరో ఏడుగురు గాయపడినట్టు అక్కడి పోలీసులు తెలిపారు. అయితే మరణించిన వారిలో ఎక్కువ మంది పిల్లలు ఉన్నారు.
నిజానికి ఆహారం కోసం చర్చ్ దగ్గరకు చాలామంది చేరుకున్నారు. వందలాది మంది గేటుకు దగ్గర గుమిగూడారు. అయితే అందులో కొందరు అసహనానికి గురై గేటును పగలగొట్టారు. దాంతో ఒకేసారి లోపలికి ప్రవేశించారు. ఆ క్రమంలో తొక్కిసలాట జరిగిందని స్థానిక పోలీసు అధికారులు తెలిపారు. "ప్రజలు గేటు దగ్గరకు గుమిగూడారు. కొందరు అసహనానికి గురయ్యారు. గేటు పగలగొట్టారు. ఒక్కసారిగా అందరూ పరుగులు తీయడం ప్రారంభించారు. అది తొక్కిసలాటకు దారితీసింది. దీనిపై దర్యాప్తు కొనసాగుతుంది. పోలీసులు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు." స్థానిక పోలీసు అధికారి గ్రేస్ ఇరింగే-కోకో వెల్లడించారు.
పోర్ట్ హార్కోర్ట్ పోలో చర్చ్‌లో జరిగిన ఓ ఫ్రీ ఛారిటీ ఈవెంట్ కోసం చాలామంది ప్రజలు గుమిగూడారని, శుక్రవారం నుంచి చాలా మంది క్యూలో నిల్చున్నారని స్థానిక మీడియా తెలియజేసింది. కాగా ఈ ఘటనలో చనిపోయిన వారిలో ఎక్కువమంది పిల్లలున్నారు. కాగా మృతులను, గాయపడిన వారిని సమీపంలోని పోర్ట్ హార్కోర్ట్ మిలట్రీ ఆస్పత్రికి తరలించినట్టు సమాచారం.