ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి బలహీనవర్గాలను అభివృద్ధి చేస్తుంటే చంద్రబాబు ఓర్వలేకపోతున్నాడని వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ అభ్యర్థి ఆర్.కృష్ణయ్య మండిపడ్డారు. చంద్రబాబుకు బీసీల ఓట్లు కావాలి కానీ, వాళ్లు ఎదుగుతుంటే ఓర్వలేకపోతున్నాడని ధ్వజమెత్తారు. చంద్రబాబు బీసీల ద్రోహి అని ఫైరయ్యారు. ఆర్.కృష్ణయ్య మీడియాతో మాట్లాడుతూ.. సీఎం వైయస్ జగన్‌లా ఈ దేశంలో ఎవరూ బీసీలకు మేలు చేయలేదని, 47 ఏళ్లలో బీసీలను ఇంతలా ప్రోత్సహించే ముఖ్యమంత్రిని చూడలేదన్నారు.
బలహీనవర్గాల హక్కుల కోసం రాజ్యసభలో పోరాడాలని తనకు సీఎం వైయస్ జగన్ అవకాశం కల్పించారని ఆర్.కృష్ణయ్య చెప్పారు. సీఎం వైయస్ జగన్ తన కేబినెట్‌లో 17 మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు మంత్రులుగా అవకాశం కల్పించారని గుర్తుచేశారు. చంద్రబాబు ఏనాడైనా బీసీలకు ఇన్ని మంత్రి పదవులు, రాజ్యసభ సీట్లు ఇచ్చాడా..? అని ప్రశ్నించారు. పార్లమెంట్‌లో బీసీ బిల్లు పెట్టాలని ఎన్నిసార్లు అడిగినా చంద్రబాబు స్పందించలేదని గుర్తుచేశారు. బీసీలంతా ఎప్పటికీ సీఎం వైయస్ జగన్ వెంటే ఉంటారన్నారు.