మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పై తాజా పాకిస్తాన్ ప్రభుత్వంలోని పెద్దలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌పై ఆ దేశ రక్షణ మంత్రి ఖవాజా అసిఫ్ తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రావిన్షియల్ అసెంబ్లీ ఎన్నికలు రద్దు చేసి సార్వత్రిక ఎన్నికలు నిర్వహించాలంటూ ఇమ్రాన్ ఖాన్ ఇటీవల ‘ఆజాదీ మార్చ్’ పేరుతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఎన్నికల నిర్వహణపై ఆరు రోజుల్లో ప్రకటన చేయాలని, లేదంటే ‘యావత్ దేశం’తో కలిసి తాను మళ్లీ రాజధాని ఇస్లామాబాద్ వస్తానని హెచ్చరించారు.
ఇమ్రాన్ ఇటీవల ఓ టీవీ చానల్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘ఆజాదీ ర్యాలీ’లో తమ పార్టీ కార్యకర్తలు ఆయుధాలు తీసుకొచ్చారని చెప్పారు. ఇమ్రాన్ చేసిన ఈ వ్యాఖ్యలపై మంత్రి అసిఫ్ మాట్లాడుతూ.. ఆ ఇంటర్వ్యూలో ఇమ్రాన్ చెప్పింది నిజమేనని, ఆయన పార్టీ కార్యకర్తలు తుపాకులే కాకుండా ఆటోమెటిక్ రైఫిల్స్ కూడా ర్యాలీలోకి తీసుకొచ్చారని ఆరోపించారు. ఆయుధాలు తీసుకురావాలని ఇమ్రానే నిరసనకారులకు సూచించారని, ప్రభుత్వానికి ఆ విషయం తెలుసని ఖవాజా పేర్కొన్నారు.