కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ కరోనా బారిన పడ్డారు. కోవిడ్ పరీక్షలో ఆమెకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఈ విషయం తెలిసిన వెంటనే ఆమె స్వీయ నిర్బంధంలోకి వెళ్లిపోయారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ అధికారికంగా వెల్లడించింది. సోనియాకు కరోనా సోకడంతో కాంగ్రెస్ శ్రేణులు ఆందోళనకు గురవుతున్నాయి. ఆమె త్వరగా కోలుకోవాలని పార్టీ నేతలు, కార్యకర్తలు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.
కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్ దీప్ సింగ్ సూర్జేవాలా మీడియాతో మాట్లాడుతూ, సోనియాగాంధీకి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిందని తెలిపారు. స్వల్ప జ్వరం, కోవిడ్ కు సంబంధించిన కొన్ని లక్షణాలతో ఆమె బాధపడుతున్నారని చెప్పారు. కరోనా పాజిటివ్ అని తెలియగానే ఆమె ఐసొలేషన్ లోకి వెళ్లిపోయారని... ఆమెకు వైద్య చికిత్స కొనసాగుతోందని తెలిపారు. ఈ నెల 8వ తేదీ లోపలే ఆమె ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ముందు హాజరవుతారని చెప్పారు. నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా, రాహుల్ గాంధీలకు ఈడీ సమన్లు జారీ చేసిన సంగతి తెలిసిందే.