ట్రెండింగ్
Epaper    English    தமிழ்

క్విడ్ ప్రోకోతో దోచుకోవడం నేరం కాదా: యనమల

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Jun 03, 2022, 03:55 AM

ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు తీవ్ర విమర్శలు గుప్పించారు. అధికారులు లంచాలు తీసుకోవడం తప్పైతే జగన్ క్విడ్ ప్రోకోతో దోచుకోవడం నేరం కాదా అని ఏపీ సీఎంను ఆయన ప్రశ్నించారు. వ్యవస్థల మొత్తాన్ని దోచేసిన వ్యక్తి లంచాలు తీసుకోవడం నేరమని జగన్ మాట్లాడటం ఈ శతాబ్దపు అతిపెద్ద జోక్ ఆయన అన్నారు. జగన్ రెడ్డి సామాజిక న్యాయం మాటలకే తప్ప ఆచరణలో శూన్యమన్నారు. వ్యవస్థల మొత్తాన్ని దోచేసిన వ్యక్తి లంచాలు తీసుకోవడం గురించి మాట్లాడటం ఈ శతాబ్దపు అతి పెద్ద జోక్‌గా మిగిలిపోతుందన్నారు. క్విడ్ ప్రోకో కేసుల్లో 14 ఛార్జ్ షీట్లలో ముద్దాయిగా ఉన్న వ్యక్తి లంచాలు గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. జగన్ తన తండ్రి అధికారంలో ఉన్నప్పుడు దోచుకున్నారని ఇప్పుడు దోచుకుంటున్నారని విమర్శించారు. దోచుకున్న డబ్బంతా జగన్ ఎక్కడ దాచుకున్నారో చెప్పాలన్నారు. 


జగన్ సామాజిక న్యాయం మాటలకే పరిమితమైపోయిందని ఎద్దేవా చేశారు యనమల. ఆచరణలో ఏ ఒక్క సామాజిక వర్గానికి జగన్ రెడ్డి న్యాయం చేయలేకపోయారన్నారు. జగన్ చెబుతున్నట్లు సామాజిక న్యాయం జరిగితే ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ చేసిన మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ లో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ 20వ స్థానంలో ఎందుకుందని ప్రశ్నించారు. గినీ ఆర్ధిక అసమానతలలో రాష్ట్రం 34వ స్థానం నుంచి 43కు ఎందుకు ఎగబాకిందని.. ప్రత్యక్ష నగదు బదిలీ (డిబిటి)లో ఆంధ్రప్రదేశ్ ర్యాంకు 19వ స్థానానికి ఎందుకు పడిపోయిందో చెప్పగలరా అంటూ ప్రశ్నించారు.


జగన్ మూడేళ్లలో విద్యారంగం పతనావస్థకు చేరుకుందని మాజీ మంత్రి విమర్శించారు. బలహీన వర్గాలకు విద్యనందిచడంలో జగన్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని.. అమ్మఒడి సరిగా ఇవ్వకపోవడంతో కాలేజీల్లో విద్యార్ధులకు అడ్మిషన్లు ఇవ్వడం లేదన్నారు. కేంద్ర విద్యాశాఖ ఇటీవల విడుదల చేసిన నేషనల్ అచ్యూమెంట్ సర్వే 2021 రిపోర్టుతో రాష్ట్రంలో విద్యావ్యవస్థ ఎంతగా దెబ్బతిందో బట్టబయలైందని చెప్పుకొచ్చారు. కరోనా సమయంలో దాదాపు 50 శాతం మంది పిల్లలకు వర్చువల్ క్లాసులు ద్వారా విద్యనందించడంలో ఏపీ వెనబడిందని రిపోర్టు తేల్చి చెప్పిందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో 90 శాతం కు పైగా బడుగు, బలహీన వర్గాల పిల్లలే చదువుకుంటున్నారని.. జగన్ మోసపురెడ్డి విధానాలతో దళిత, గిరిజన, బలహీన వర్గాల పిల్లల భవిష్యత్తు నాశనం అవుతోందన్నారు.


తలసరి ఆదాయం (స్థిరధరల ప్రకారం) టీడీపీ హయాంలో రెండంకెల్లో ఉంటే వైఎస్సార్‌సీపీ వచ్చాక మూడేళ్లలో సింగిల్ డిజిట్ (1.03%)కు పతనమైందన్నారు. ప్రజల వినిమయ వ్యయం పూర్తిగా పడిపోయిందని.. స్థిరధరల ప్రకారం జీ.ఎస్.డీ.పీ టీడీపీ ప్రభుత్వ హయాంలో రెండంకెల వృద్ధి ఉంటే.. వైఎస్సార్‌సీపీ పాలనలో నెగటివ్ గ్రోత్ (మైనస్ 2.58)కు దిగజార్చారన్నారు. ధరలు పెరగడంతో కడుపు నిండా భోజనం చేయడానికి కూడా ప్రజల దగ్గర డబ్బు లేదన్నారు. జగన్, వైఎస్సార్‌సీపీ నాయకుల ఆదాయాలు పెరుగుతున్నాయి కానీ ప్రజల ఆదాయాలను పూర్తిగా పడిపోయాయని విమర్శించారు. జగన్ చేసిన సామాజిక న్యాయం ఇదేనా రాష్ట్రం ఆర్ధికంగా దివాళా తీయడానికి జగన్ రెడ్డి అసమర్ధత, చేతగానితనమే కారణం అన్నారు.


యువతకు ఉద్యోగాలు లేవు.. ఉద్యోగాలు లేనప్పుడు ఉపాధి ఏ విధంగా లభిస్తుందని యనమల ప్రశ్నించారు. ఉపాధి హామీ పని దినాలను 25 శాతం తగ్గించారని.. కేంద్ర ప్రభుత్వ పథకాలకు రాష్ట్రం మ్యాచింగ్ గ్రాంటు ఇవ్వకపోవడంతో ఆ పథకాలన్నింటిని నిర్వీర్యం చేశారని విమర్శించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ సబ్ ప్లాన్ నిధులు ఏం చేశారో ఎవరీకి తెలియదని.. ఈ వర్గాలు నివాసం ఉండే ప్రాంతాల్లో ఒక్క అభివృద్ధి కార్యక్రమం చేపట్టలేదన్నారు. ఏదాడికి దాదాపు రూ. 57 వేల కోట్ల రూపాయాలను దారిమళ్లించి ఈ వర్గాలను జగన్ మోసం చేశారని.. అప్పుల భారం, టాక్సుల భారం పేదవారిపై మోపడమేనా ఆయన చేసిన సామాజిక న్యాయం అన్నారు.


మహానాడు ఘనవిజయం సాధించడంతో వైఎస్సార్‌సీపీ నాయకుల్లో భయం పట్టుకుందన్నారు మాజీ మంత్రి. మహానాడుకు పోటీగా బస్సుయాత్ర చేయాలనుకున్నారని.. ప్రజలను మోసం చేసి ఓట్లు సంపాదించుకున్న జగన్ బస్సు యాత్రతో ప్రజల నమ్మకం పోగుట్టుకున్నాని తెలుసుకున్నారన్నారు. దావోస్ పర్యటనతో ఎపికి ఒరగబెట్టింది ఏంటో చెబుతారని ఆశించిన.. ప్రజల ఆలోచనలను పక్కదారి పట్టించేందుకు లంచం అంశం మీద జగన్ రెడ్డి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa