చాలా మంది శరీరానికి అవసరమైనంతగా మంచి నీరు తీసుకోరు. నీళ్లు తాగకపోవడం చిన్న సమస్య ఏమీ కాదు. అయినా సరే ఈ విషయంలో ప్రజలు శ్రద్ధ చూపరు. పని ఒత్తిడిలో మరిచిపోవడం వల్ల కొందరు, అవగాహన లేక మరికొందరు సరైన మోతాదులో నీటిని తీసుకోరు. అయితే సరిపడ నీళ్లు తాగకుంటే అనేక అనారోగ్య సమస్యలు వస్తాయి. నీళ్లు తాగకపోతే శరీరంలో వచ్చే మార్పులు ఓ సారి చూద్దాం.
చాలా మంది అధిక బరువుతో సతమతం అవుతుంటారు. అలాంటి వారు భోజనానికి 20 నిమిషాల ముందు రెండు కప్పుల నీటిని తాగితే బరువు తగ్గాలనుకునే వారికి ఎంతో మేలు చేకూరుతుంది. తగినన్ని మంచి నీళ్లు తాగితే మొటిమలు, యాక్నే వంటి సమస్యలు దరిచేరవు. తగినన్ని నీళ్లు తాగకపోతే ముఖమంతా కమిలిపోయి, కాంతిని కోల్పోయి ఉంటుంది. కళ్లకింద ముడతలు, వాపు ఉన్నాయంటే నీరు తక్కువగా తాగడం కూడా ఓ కారణం అయి ఉంటుంది. ముక్కు ఎర్రబడి, పొడిగా ఉన్నా, తలంతా చుండ్రుపట్టి, జుట్టు జీవం లేకుండా కనిపిస్తే మీరు తాగుతున్న నీటి పరిమాణం ఎంతో ఓ సారి చెక్ చేసుకోవాల్సిందే. కంటి ఆరోగ్యానికి మంచి నీళ్లు తాగడం అతి ముఖ్యం అని మర్చిపోవద్దు.