భద్రాచలం రామాలయంలో మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం నుంచి భక్తులు విశేష సంఖ్యలో దర్శనాలు చేసుకున్నారు. కీర్తనలు ఆలపించి భజనలు చేశారు. ఉదయం తలుపులు తెరిచిన తర్వాత సుప్రభాతం పలికిన అర్చకులు ఆరాధన జరిపి నామార్చనలు పఠించారు. అభిషేకాన్ని కన్నులపండుగగా జరిపారు. మంత్రోచ్ఛారణలు మార్మోగుతుండగా ప్రధాన కోవెలలో జరిగిన ఈ క్రతువును కనులారా వీక్షించిన భక్తుల మది పరమానందభరితమైంది. క్షేత్ర విశిష్టతను ప్రవచనం చేసిన తీరు ఆధ్యాత్మిక భావాలను పెంపొందించింది. విశ్వక్సేనుల వారిని సంప్రదాయబద్ధంగా పూజించి పుణ్యహావచనం జరిపి వధూవరుల గోత్రనామాలను పఠించి ప్రవర జరిపారు. కంకణధారణ నిర్వహించి కన్యాదానం జరిపి యోక్త్రధారణ చేశారు. భక్తుల జై జై నీరాజనాల మధ్య మాంగళ్యధారణ జరిగింది. తలంబ్రాల వేడుక మంత్ర ముగ్ధులను చేసింది. ఈ కార్యక్రమంలో ఆలయ వేద పండితులు, అర్చకులు, భక్తులు పాల్గొన్నారు.