తమ దేశంలో భారీస్థాయిలో అవినీతికి పాల్పడిన ఇద్దరు భారతీయ సోదరులైన రాజేశ్ గుప్తా, అతుల్ గుప్తాను యునైటెడ్ అరబ్ ఎమిరైట్స్‌లో అరెస్ట్ చేసినట్టు దక్షిణాఫ్రికా ప్రకటించింది. గుప్తా బద్రర్స్‌గా ప్రాచుర్యం పొందిన ముగ్గురు సంపన్న సోదరులు.. తమ అక్రమాలు బయటపడగానే దుబాయి పారిపోయారు. దీంతో అవినీతి వ్యవహారంలో గుప్తా సోదరులపై ఇంటర్‌పోల్ రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసిన దాదాపు ఏడాది తర్వాత వీరు అరెస్ట్ కావడం గమనార్హం. జాకబ్ జుమా దక్షిణాఫ్రికా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ప్రభుత్వ యాజమాన్యంలోని సంస్థల నుంచి బిలియన్ల ర్యాండ్లను (దక్షిణాఫ్రికా కరెన్సీ) దోచుకున్నట్టు గుప్తా సోదరులపై ఆరోపణలు ఉన్నాయి. వారి అక్రమాలపై విచారణలు సాగుతుండగానే కుటుంబాలతో సహా దుబాయికి పారిపోయారు. దీంతో దక్షిణాఫ్రికా ప్రభుత్వం ఇంటర్‌పోల్‌ను ఆశ్రయించడంతో రెడ్ కార్నర్ నోటీసులు జారీ అయ్యాయి. తాజాగా, వారిలో రాజేశ్ గుప్తా, అతుల్ గుప్తాను సోమవారం అక్కడి పోలీసులు అరెస్టు చేశారు. ఈ మేరకు దక్షిణాఫ్రికా ప్రభుత్వం ఓ ప్రకటన వెల్లడించింది. అయితే, మూడో సోదరుడు అజయ్ గుప్తాను అరెస్టు చేశారా? లేదా? అనే విషయంపై స్పష్టత లేదని తెలిపింది.
గుప్తా సోదరులను దుబాయి నుంచి రప్పించేందుకు దక్షిణాఫ్రికా ప్రభుత్వం ప్రయత్నాలు ముమ్మరం చేసింది. అయితే, రెండు దేశాల మధ్య నేరస్థుల అప్పగింత ఒప్పందం లేకపోవడంతో గుప్తా సోదరులను తీసుకొచ్చేందుకు ఐక్యరాజ్యసమితి సాయం కోరింది. గతేడాది యూఏఈతో నేరస్థుల అప్పగింతపై ఒప్పందం చేసుకోవడంతో రాజేశ్, అతుల్ గుప్తాలను దక్షిణాఫ్రికాకు అప్పగించే అవకాశాలున్నాయి.
ఉత్తర్ ప్రదేశ్‌లోని షహరాన్‌పూర్‌కు చెందిన అజయ్, అతుల్, రాజేశ్ గుప్తాలు 90వ దశకంలో దక్షిణాఫ్రికాకు వెళ్లి షూ వ్యాపారం ప్రారంభించారు. ఆ తర్వాత అక్కడే స్థిరపడి ఐటీ, మీడియా, మైనింగ్ ఇలా అనేక రంగాల్లో వ్యాపారాన్ని విస్తరించి అనతికాలంలోనే దక్షిణాఫ్రికాలో అత్యంత సంపన్నులుగా అవతరించారు. మాజీ అధ్యక్షుడు జాకబ్ జుమాతో మంచి సాన్నిహిత్యం ఉండటాన్ని తమకు అనుకూలంగా మార్చుకున్నారు. నేషనల్ ఎలక్ట్రిసిటీ సప్లయర్ ‘ఎస్కాం’ వంటి పలు ప్రభుత్వరంగ సంస్థలను కొల్లగొట్టినట్లు వీరిపై ఆరోపణలు ఉన్నాయి. అంతేకాదు, జుమా కేబినెట్ మంత్రుల దగ్గర్నుంచి అనేక ప్రభుత్వ నియామకాలను వీరు ప్రభావితం చేశారని ఆరోపణలు వచ్చాయి.
గుప్తా సోదరుల అవినీతి కారణంగానే 2018లో జుమా అధ్యక్ష పదవి నుంచి బలవంతంగా తప్పుకున్నారు. అదే సమయంలో గుప్తా సోదరులు కూడా దేశం విడిచి దుబాయి పారిపోయారు. ప్రభుత్వ సంస్థల నుంచి గుప్తా సోదరులు దాదాపు 15 బిలియన్ రాండ్లు అంటే భారత కరెన్సీలో దాదాపు రూ.7,513కోట్లను కొల్లగొట్టారు.
వీరి అరెస్ట్‌ను దక్షిణాఫ్రికా ప్రతిపక్షం స్వాగతించింది. ‘‘ఇన్నాళ్లుగా మన దేశాన్ని దోచుకుని విదేశాలకు పారిపోయి ఈరోజు లక్షలాది మంది దక్షిణాఫ్రికా ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలకు ప్రత్యక్షంగా బాధ్యులైన వారిపై అరెస్టులు, విచారణకు ఇది నాంది అని మేం ఆశిస్తున్నాం’’ అని ప్రతిపక్ష డెమొక్రాటిక్ అలయెన్స్ ఓ ప్రకటనలో తెలిపింది.