అవిశ్వాస తీర్మానం నుంచి బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ గట్టెక్కారు. సోమవారం నిర్వహించిన ఓటింగ్‌లో ఆయనకు 59 శాతం మంది అనుకూలంగా ఓటు వేశారు. సొంత పార్టీ నేతలే జాన్సన్‌పై అవిశ్వాస తీర్మానం పెట్టడం గమనార్హం. అవిశ్వాస తీర్మానం నెగ్గాలంటే మొత్తం 360 మంది సభ్యులున్న బ్రిటన్ పార్లమెంట్ దిగువ సభలో 180 మంది మద్దతు తప్పనిసరి. అయితే, రహస్య ఓటింగ్‌లో జాన్సన్‌కు 211 మంది ఎంపీలు అనుకూలంగా ఓటేయడంతో ఆయనకు పదవీగండం తప్పింది. కొనసాగనున్నారు. అయితే, 148 మంది సభ్యులు మాత్రం జాన్సన్‌కు వ్యతిరేకంగా ఓటేయడం గమనార్హం.
ఇదిలావుంటే జాన్సన్ కంటే ముందున్న ప్రధాని థెరిసా మే 2018లో అవిశ్వాస తీర్మానం నెగ్గినా.. తర్వాత ఆరు నెలలకు పదవి నుంచి తప్పుకున్నారు. ఆ తర్వాత 2019 ఎన్నికల్లో బోరిస్ జాన్సన్ విజయం సాధించారు. మరోవైపు వచ్చే ఏడాది జరిగే సాధారణ ఎన్నికల్లో పార్టీ గెలవాలంటే ప్రధాని పదవి నుంచి జాన్సన్‌ను తప్పించాలనే డిమాండ్ కూడా జోరుగా వినబడుతోంది.
రెండేళ్ల కిందట కరోనా కట్టడికి లాక్‌డౌన్ అమల్లో ఉన్నప్పుడు తన అధికారిక నివాసంలో కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించి పార్టీలు, వేడుకలు నిర్వహించడంపై తీవ్ర దుమారం రేగింది. పార్టీగేట్ కుంభకోణంపై ప్రతిపక్షం సహా సొంత పార్టీ నేతల్లోనూ తీవ్ర అసహనం వ్యక్తమయ్యింది. ఈ నేపథ్యంలోనే కన్జర్వేటివ్ పార్టీ ఎంపీలు కొందరు బోరిస్ జాన్సన్ నాయకత్వాన్ని ప్రశ్నిస్తూ.. తన అబద్ధాలతో పార్లమెంటును తప్పుదారి పట్టించారని మండిపడుతున్నారు.
ఈ నేపథ్యంలో 1922 కమిటీకి బోరిస్ జాన్సన్‌పై అవిశ్వాసాన్ని తెలుపుతూ కన్జర్వేటివ్ పార్టీ ఎంపీలు రహస్య లేఖలు పంపారు. పార్లమెంట్‌లో అధికారిక పదవులను నిర్వహించని ఈ కమిటీకి నేతలపై అవిశ్వాసాన్ని తెలుపుతూ పార్టీ ఎంపీలు విజ్ఞప్తి చేస్తే ఓటింగ్ నిర్వహిస్తుంది. బోరిస్ జాన్సన్‌కు వ్యతిరేకంగా అవిశ్వాసంపై ఓటింగ్ నిర్వహించడానికి నిబంధనలకు మించిన ఓటింగ్ విజ్ఞప్తులు వచ్చాయని కమిటీ వెల్లడించింది. దీంతో యూకే పార్లమెంటులో బోరిస్ జాన్సన్ అవిశ్వాస తీర్మానంపై రహస్య ఓటింగ్ జరిగింది.
తొలుత బోరిస్ జాన్సన్‌ను సమర్థిస్తూ 169 మంది ఎంపీలు ప్రకటనలు చేశారు. వారంతా ఓటింగ్‌లో పాల్గొన్నారు. కానీ, ఆయన ఈ సవాల్ నుంచి నెగ్గాలంటే మొత్తం 180 ఓట్లు అవసరం. అయితే, ఈ ఓటింగ్ రహస్యంగా జరిగింది. కాబట్టి, బహిరంగంగా జాన్సన్‌ను సమర్థించిన ఎంపీలు అదే వైఖరితో ఆయనను సమర్థిస్తూ ఓటేయాలనే ఏమీ లేదు. కానీ, తనపై అనుమానాలు, ఆరోపణలకు జాన్సన్ ఈ గెలుపుతో గట్టి సమాధానం ఇచ్చినట్టు అయింది. పార్టీ ఎంపీలు బోరిస్ జాన్సన్‌పైనే విశ్వాసాన్ని ఉంచినట్టు స్పష్టం అయింది.