చేసే పనిలో నిబద్దతను కొందరు మాత్రమే ప్రదర్శిస్తారు. అందులోనూ తమ ప్రాణాలను లెక్కచేయకుండా నిబద్దతను ప్రదర్శించడం మనం చూసివుండం. ఇదిలావుంటే ప్రయాణికులను రక్షించడానికి ఓ రైలు లోకో పైలట్ ప్రాణత్యాగం చేసి హీరోగా మారిపోయాడు. ఈ ఘటన చైనాలో వెలుగుచూసింది. నైరుతి చైనాలోని గుయిజౌ ప్రావిన్స్‌లో రైలు పట్టాలు తప్పడాన్ని గుర్తించిన లోకో పైలట్ ఐదు సెకన్లలోనే డి2809 యాంగ్ యోంగ్ రైలును ఆపి 144 మంది ప్రయాణికుల ప్రాణాలను నిలిపాడు. అయితే, ఈ క్రమంలో అతడు ప్రాణాలను కోల్పోయాడు. రైలు రోంగ్ జియాంగ్ స్టేషన్‌కు సమీపంలో ఉండగా అక్కడ బురద, రాళ్లను ఢీకొట్టి పట్టాలు తప్పడం వల్ల డ్రైవర్ యాంగ్ యోంగ్ మరణించాడు. ఈ ప్రమాదంలో లోకో పైలట్ చనిపోగా, మరో 8మంది గాయపడినట్టు చైనా స్టేట్ రైల్వే గ్రూప్, జాతీయ రైల్వే ఆపరేటర్ విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపాయి.
మిగిలిన 136 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడినట్టు తెలిపింది. గుయిజౌ నుంచి గ్యాంగ్జూకు వస్తుండగా రోంగ్‌జియాంగ్ స్టేషన్‌కు సమీపంలో రైలు సొరంగంలో ఉన్నప్పుడు ట్రాక్‌పై అసాధారణతను గుర్తించిన లోకో పైలట్ యోంగ్.. అత్యవసర బ్రేక్‌లను ఉపయోగించినట్టు నిపుణులు గుర్తించారు. రైలు పట్టాలు తప్పడానికి ముందు మట్టి, రాళ్లను ఢీకొని 900 మీటర్లకు పైగా జారిపోయింది.
మాజీ సైనికుడైన యోంగ్ 1993-1996 వరకు పీపుల్స్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్స్ (పీఏపీ) హైనాన్ కార్ప్స్‌లో పనిచేశారు. స్క్వాడ్రన్ లీడర్‌గా, అత్యుత్తమ సైనికుడిగానూ ప్రశంసలు అందుకున్నారు. రిటైర్ అయిన తర్వాత కో-డ్రైవర్, అసిస్టెంట్ డ్రైవర్, ఫోర్‌మెన్, డ్రైవర్ ఇన్‌స్ట్రక్టర్, గ్రౌండ్ డ్రైవర్, రైలు డ్రైవర్‌గా యోంగ్ పనిచేశారు.
అంత మంది ప్రాణాలు కాపాడిన యోంగ్‌ను చైనా ప్రజలు హీరోగా కొనియాడుతూ ఆన్‌లైన్‌లో నివాళులు అర్పిస్తున్నారు. ‘‘ D2809 5 సెకన్ల బ్రేకింగ్‌లో రైలు డ్రైవర్.. అత్యవసర బ్రేకింగ్ జ్ఞాపకశక్తిగా మారుతుంది.. యాంగ్ యోంగ్ తాను చేయగలిగినదంతా చేశాడు’’ అని ఓ నెటిజన్ ట్వీట్ చేశాడు. ‘‘గుయాంగ్ నార్త్ నుంచి గ్వాంగ్జూ సౌత్‌కు D2809 రైలు డ్యూటీలో ఉన్న యాంగ్ యోంగ్ అనే ఒక హీరో ఈ రోజు చైనాలో ఉన్నాడు.. అతను తనను తప్ప అందరినీ రక్షించాడు’’ అని వ్యాఖ్యానించాడు.