ఏలూరు జిల్లా దెందులూరు పోలీస్ స్టేషన్ ఎదుట వైయస్ఆర్ సీపీ కార్యకర్తలు, టీడీపీ కార్యకర్తలు రాళ్లు, కర్రలతో పరస్పరం దాడి చేసుకున్న ఘటన మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. ఈ ఘటనలో కొంత మంది కార్యకర్తలతో పాటు ఎస్‌ఐ ఐ.వీర్రాజు సైతం తీవ్రంగా గాయపడ్డారు.వివరాల్లోకి వెళ్ళితే... దెందులూరు మండలం శ్రీరామవరానికి చెందిన టీడీపీ కార్యకర్త మోర్ల వరకృష్ణ, చోడవరపు సాయి అజయ్ కలిసి ఎమ్మెల్యే అబ్బయ్యచౌదరి, పార్టీ మండల కన్వీనర్ కామిరెడ్డి నాని తదితరులపై 15 రోజులుగా సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెడుతున్నారు. దీనిపై పార్టీ మండల కన్వీనర్ కామిరెడ్డి నాని మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేయగా.. విచారణ నిమిత్తం మోర్ల వరకృష్ణను సాయంత్రం 4.30 గంటలకు పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చారు. అతనికి మద్దతుగా దాదాపు వందమంది టీడీపీ నాయకులు, కార్యకర్తలు దెందులూరు స్టేషన్‌కు వచ్చారు. ఈ విషయం తెలిసి శ్రీరామవరం నుంచి వైయస్ఆర్ సీపీ మండల కన్వీనర్, కార్యకర్తలు స్టేషన్‌కు వచ్చారు. కాగా... ఇరు వర్గాలు ఎదురైనా సందర్భంలో గొడవకు దారి తీసినట్లు తెలుస్తుంది. సమాచారం అందుకున్న ఏలూరు డీఎస్పీ పైడేశ్వరరావు నియోజకవర్గంలోని ఎస్‌ఐలు, ఏలూరు నగరంలోని సీఐలతో దెందులూరు పోలీస్‌స్టేషన్‌కు వచ్చి పరిస్థితిని అదుపు చేశారు. గాయపడిన వారు ఏలూరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.